బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ ఓటమి.. చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్థాన్

  • స్వదేశంలో ఒక వేదికలో ఆడిన వరుస మ్యాచ్‌ల్లో 400లకుపైగా స్కోర్లు సాధించినా ఓడిపోయిన తొలి జట్టుగా అవతరణ
  • 2022లో ఇంగ్లండ్‌పై 579 పరుగులు సాధించినా పాకిస్థాన్‌కు తప్పని ఓటమి
  • రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించడంతో పాక్ పేరిట చెత్త రికార్డు నమోదు
ఆదివారం ముగిసిన రావల్పిండి టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్‌ను మట్టికరిపించి బంగ్లాదేశ్‌ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై బంగ్లా తొలి విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించి ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటించి అనూహ్య రీతిలో ఓటమి పాలవ్వడం పాకిస్థాన్‌కు అవమానకరంగా మారింది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆధిక్యాన్ని సాధించడం పాక్ ఆటగాళ్లను షాక్‌కు గురిచేస్తోంది. నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే చివరి రోజున రెండవ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలడంతో మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగింది.

పాక్‌ను బంగ్లాదేశ్ బౌలర్లు కేవలం 146 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో విజయానికి అవసరమైన 30 పరుగులను బంగ్లా బ్యాటర్లు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించారు. స్వదేశంలో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం పాక్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు మరో చెత్త రికార్డు కూడా పాకిస్థాన్ పేరిట నమోదయింది. స్వదేశంలో ఒక వేదికలో ఆడిన రెండు వరుస మ్యాచ్‌ల్లో 400లకుపైగా స్కోర్లు సాధించినప్పటికీ.. ఆ మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన తొలి జట్టుగా పాకిస్థాన్‌ నిలిచింది. ఈ ఓటమి కంటే ముందు.. డిసెంబర్ 2022లో ఇదే రావల్పిండి వేదికగా ఇంగ్లాండ్‌ చేతిలో పాక్ అనూహ్యంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ 579 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ ఆ జట్టు అనూహ్యంగా ఓడిపోయింది.

కాగా రావల్పిండి టెస్టులో పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో సౌద్ షకీల్ 141, మహ్మద్ రిజ్వాన్ 171 పరుగులు సాధించడంతో 448/6 భారీ స్కోర్ వద్ద పాకిస్థాన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫీకర్ 191 పరుగులతో చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక రెండవ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో పాకిస్థాన్‌ 146 పరుగులకే ఆలౌట్ అవడంలో కీలక పాత్ర పోషించారు.


More Telugu News