నువ్వేదో హీరో అన్నట్టుగా పోజులు కొట్టడం మంచిది కాదు: ఈటల రాజేందర్

  • అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా
  • సామాన్యుల ఇళ్లను కూడా కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఈటల
  • ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం
  • ప్రజల ఇళ్ల జోలికి వెళితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక
తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండడం పట్ల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. హైదరాబాదులో అక్రమంగా కట్టుకున్న పెద్దల కట్టడాలను కూల్చడం సంతోషదాయకమేనని అన్నారు. అయితే, సామాన్యులను కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

కాంగ్రెస్ పార్టీకి వందేళ్ల చరిత్ర ఉందని, రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పుట్టలేదని స్పష్టం చేశారు. 30, 40 ఏళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో ఇక్కడ చెరువుల్లో ఎఫ్ టీఎల్ భూముల్లో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని, ఇళ్లు కట్టించారని, లే అవుట్లకు అనుమతులు ఇచ్చారని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇవాళ అలాంటి పట్టా భూముల్లోని ఇళ్లను, లే అవుట్లను తొలగిస్తామంటూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తమ ఇళ్లు కూల్చివేస్తారేమోనని సాహెబ్ నగర్, ఫాక్స్ సాగర్ ప్రజలు భయపడుతున్నారని వివరించారు.

"హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టా గురించి నేను మాట్లాడడం లేదు. సామాన్య ప్రజలను వేధిస్తూ, భయభ్రాంతులకు గురిచేసే చర్యలపై ఓసారి ఆలోచించాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే, అయ్యప్ప నగర్ సొసైటీలో ఇలాగే ఇళ్లు కూల్చేసే ప్రయత్నం చేసి, నాలుగు రోజులకే తోక ముడిచారు. 

ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటిపై చర్చించే ధైర్యం లేక ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నావు. నీకు నిజంగా దమ్ముంటే... ప్రభుత్వమే పూడ్చివేసిన చెరువులపై దృష్టి సారించు. 

బతుకమ్మ కుంట ఎవరు పూడ్చారు? ప్రభుత్వమే పూడ్చివేసింది. కరీంనగర్ లో చెరువులను కూడా ప్రభుత్వమే పూడ్చేసింది. ఇలా ప్రభుత్వం పూడ్చేసిన చెరువులు ఎన్ని అనేది లెక్క తేలాలి. ఎఫ్ టీఎల్ భూముల్లో పట్టాలు ఇవ్వడంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అంతేతప్ప, రాత్రిపూట దొంగల్లాగా వెళ్లి మిషన్లతో సామాన్యుల ఇళ్లు కూలగొట్టే పద్ధతి మంచిది కాదు. 

పెద్దపెద్దోళ్లవి కూలగొడుతున్నావు... సంతోషం. కానీ సామాన్యులను ఇబ్బందిపెడితే మాత్రం సహించేది లేదు. ప్రతిదానికి ఒక చట్టం, ఒక వ్యవస్థ ఉంటుంది. కానీ అన్నింటినీ పక్కనబెట్టి నీ తాత జాగీరులాగా, నువ్వేదో హీరో అన్నట్టుగా, నీ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలన్నీ ఆపుతున్నట్టుగా నువ్వు పోజులు కొట్టడం మంచిది కాదు" అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హెచ్చరించారు.


More Telugu News