కోల్‌కతా హత్యాచారం ఘటన నేపథ్యంలో... మహిళలపై నేరాలకు పాల్పడేవారికి ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

కోల్‌కతా హత్యాచారం ఘటన నేపథ్యంలో... మహిళలపై నేరాలకు పాల్పడేవారికి ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
  • మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు బలోపేతం చేస్తున్నామన్న ప్రధాని
  • మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ
  • స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీకి రూ.5000 కోట్ల నిధులు విడుదల
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేరస్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి హెచ్చరిక చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా చట్టాలను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని అన్నారు. 

‘‘మహిళల భద్రత చాలా ముఖ్యం. మహిళలపై జరిగే నేరాలు క్షమించరానివి. ఈ విషయాన్ని నేను మరోసారి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతాను. దోషులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టొద్దు’’ అని అన్నారు. 

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనతో పాటు కొన్ని వారాల దేశవ్యాప్తంగా మహిళలపై వెలుగుచూస్తున్న నేరాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
 
మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో జరిగిన ‘లాఖ్‌పతీ దీదీస్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఏడాదికి లక్ష రూపాయలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న ‘లాఖ్‌పతి దీదీస్’తో (స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు) మోదీ ముచ్చటించారు. తన మూడవ దఫా ప్రభుత్వంలో కొత్తగా 11 లక్షల మంది లాఖ్‌పతి దీదీలుగా మారారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్వయంసహాయక సంఘాలకు రుణ పంపిణీ కోసం రూ. 5,000 కోట్ల బ్యాంకు నిధులను విడుదల చేశారు. ఈ భారీ మొత్తం 2.35 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 25.8 లక్షల మంది సభ్యులకు పంపిణీ చేయనున్నారు. 

కాగా ఏడాదికి రూ.లక్షకు పైగా ఆదాయం పొందుతున్న మరో 3 కోట్ల మంది 'లాఖ్‌పతి దీదీ'లను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

‘లాఖ్‌పతీ దీదీస్ సమ్మేళన్’ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తదితరులు పాల్గొన్నారు.


More Telugu News