నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ

  • తుమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి అని వెల్లడి
  • తుమ్మిడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేసినట్లు వెల్లడి
  • ఎన్ కన్వెన్షన్‌కు ఎలాంటి అనుమతులు లేవన్న రంగనాథ్
  • ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే లేదన్న హైడ్రా
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ కూడా ఒకటి అన్నారు. ఈ నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేశామన్నారు. తుమ్మిడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూల్చివేసినట్లు తెలిపారు.

హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కలిసి కూల్చివేసినట్లు వెల్లడించారు. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఒక ఎకరా 12 గుంటల్లో... అలాగే బఫర్ జోన్‌లోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవన్నారు. గతంలో అనుమతుల కోసం ప్రయత్నించినప్పటికీ... అనుమతులు రాలేదన్నారు.

హైకోర్టు స్టే ఇచ్చిందనేది అవాస్తవం: హైడ్రా

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిందని చెబుతున్నారని, కానీ అలాంటి స్టే ఏదీ లేదని హైడ్రా స్పష్టం చేసింది. స్టే ఇచ్చిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఈరోజు మాత్రం కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు తీర్పును పాటిస్తామని తెలిపింది. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినందునే కూల్చేసినట్లు తెలిపింది. 

తమ కట్టడాలను క్రమబద్దీకరించుకోవడానికి ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం గతంలో చాలా ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించింది. కానీ ఆ విజ్ఞప్తులు తిరస్కరణకు గురయ్యాయని తెలిపింది. తాము చట్ట ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని పేర్కొంది.


More Telugu News