సౌదీ ఎడారిలో త‌ప్పిపోయిన తెలంగాణ యువ‌కుడు.. ద‌య‌నీయ‌స్థితిలో మృతి!

  • ఎడారిలో చిక్కుకుని 4 రోజులు తిండి, నీరు లేక మృతి
  • మృతుడు మహ్మద్ షాజాద్ ఖాన్ తెలంగాణలోని కరీంనగర్ నివాసి
  • మూడేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన షాజాద్‌
  • సౌదీలో ఓ టెలికమ్యూనికేషన్ కంపెనీలో ఉద్యోగం
సౌదీ అరేబియా ఎడారిలో త‌ప్పిపోయిన తెలంగాణ యువ‌కుడు మహ్మద్ షాజాద్ ఖాన్ ద‌య‌నీయ‌స్థితిలో చనిపోయాడు. సౌదీలో ఓ టెలికమ్యూనికేషన్ కంపెనీలో ప‌ని చేస్తున్న‌ అత‌డు ఐదు రోజుల కింద‌ట త‌న తోటి ఉద్యోగితో క‌లిసి ఓ చోటుకు వెళ్లారు. అయితే, జీపీఎస్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో దారి త‌ప్పి ప్ర‌మాద‌క‌ర‌మైన రబ్ అల్ ఖ‌లీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు. 

అదే స‌మ‌యంలో వాహ‌నంలో పెట్రోల్ అయిపోవ‌డం, మొబైల్ స్విచ్ఛాఫ్ కావ‌డంతో అందులోనే చిక్కుకుపోయారు. నాలుగు రోజులుగా విప‌రీత‌మైన‌ ఎండలో నిరంతరం నడవడం వల్ల డీహైడ్రేషన్‌కు గుర‌య్యారు. అలాగే తినడానికి ఆహారం, నీరు లేకపోవడంతో వారిద్ద‌రూ ప్రాణాలొదిలారు. 

కాగా, మృతుడు మహ్మద్ షాజాద్ తెలంగాణలోని కరీంనగర్ నివాసి అని తెలిసింది. అత‌నితో పాటు చ‌నిపోయిన మ‌రో వ్య‌క్తిని సూడాన్ పౌరుడిగా గుర్తించారు. మృతదేహాల‌ను వారి కారు పక్కన ఉన్న ఇసుక తిన్నెలలో గురువారం అధికారులు గుర్తించారు.

అయితే, వారిద్దరూ చ‌నిపోయిన రబ్ అల్ ఖలీ ఎడారి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఎడారులలో ఒకటి. ఈ ఎడారి ఏకంగా 650 కిలోమీటర్ల మేర‌ విస్తరించి ఉంటుంది. ఇది ఉత్తర సౌదీ అరేబియాలోని హోఫుఫ్ నుంచి రియాద్, నజ్రాన్ ప్రావిన్సులు, యూఏఈ, ఒమన్ , యెమెన్ వరకు విస్తరించింది.

ఇదిలాఉంటే.. ఉపాధి కోసం షాజాద్ ఖాన్ మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన‌ట్లు స‌మాచారం. అక్క‌డి ఓ టెలికమ్యూనికేషన్ కంపెనీలో ట‌వ‌ర్ టెక్నీషియ‌న్‌గా పనిచేస్తున్నాడు. షాజాద్ మృతితో అత‌ని స్వ‌స్థ‌లంలో విషాదం అలముకుంది. అతడి మ‌ర‌ణ‌వార్త తెలుసుకుని కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.


More Telugu News