కివీస్‌, శ్రీలంక మ‌ధ్య ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్‌.. చాలా కాలం తర్వాత 'రెస్ట్ డే'!

  • సెప్టెంబ‌ర్‌లో కివీస్‌, శ్రీలంక మ‌ధ్య గాలే వేదిక‌గా రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌
  • సెప్టెంబర్ 18 నుంచి 23 వ‌ర‌కు మొద‌టి టెస్టు
  • 21న శ్రీలంక అధ్యక్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో 'రెస్ట్ డే'
  • సాధారణంగా టెస్టు మ్యాచులో తీసుకునే విరామ‌మే 'రెస్ట్ డే'
  • ఆఖ‌రిసారిగా 2008లో బంగ్లా, శ్రీలంక టెస్ట్‌ మ్యాచ్‌లో 'రెస్ట్ డే' వినియోగం
సెప్టెంబరులో జ‌రిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్‌ శ్రీలంక‌కు రానుంది‌. ఈ రెండు టెస్టు మ్యాచ్‌లు గాలేలోనే జరగనున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్‌లలో ప్రస్తుతం శ్రీలంక, న్యూజిలాండ్ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది. వ‌చ్చే ఏడాది జ‌రిగే టెస్ట్ ఛాంఫియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాలంటే త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకోవాల్సి ఉంటుంది. 

అయితే, ఈ సిరీస్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లో చాలా కాలం త‌ర్వాత‌ 'రెస్ట్ డే'ని మళ్లీ తీసుకువ‌స్తున్నారు. సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో 'రెస్ట్ డే' ఉంటుంది. అంటే టెస్ట్‌ మ్యాచ్ ఆరు రోజుల పాటు కొన‌సాగుతుంద‌న్న‌మాట‌. ఈ మ్యాచ్‌ సెప్టెంబర్ 18న ప్రారంభమై సెప్టెంబర్ 23న ముగుస్తుంది. ఇక రెండో టెస్టు మాత్రం సాధారణ ఐదు రోజుల మ్యాచ్‌గానే ఉంటుంది. 

టెస్టు క్రికెట్‌లో అసలేంటీ 'రెస్ట్ డే'..? 
'రెస్ట్ డే' అనేది సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లో తీసుకునే విరామం. గతంలో మ్యాచ్‌లలో ఆట‌గాళ్ల‌కు రిలీఫ్ కోసం మధ్యలో ఒక రోజు విశ్రాంతి ఇచ్చేవారు. సాధారణంగా ఇది ఆదివారాలుగా ఉండేది. వీటిని గతంలో విశ్రాంతి దినంగా భావించేవారు. కానీ ఆధునిక క్రికెట్‌లో ఇది నెమ్మదిగా క‌నుమ‌రుగైపోయింది.

2008లో చివ‌రిసారిగా ఇలా విశ్రాంతి దినాన్ని ఉప‌యోగించారు. ఈ టెస్ట్ మ్యాచ్ ఢాకాలో జరిగింది. శ్రీలంకతో జరిగిన బంగ్లాదేశ్ ప్రారంభ మ్యాచ్‌లో పార్లమెంటరీ ఎన్నికల కారణంగా డిసెంబర్ 29న విశ్రాంతి దినాన్ని చేర్చారు. 

ఇప్పుడు కివీస్‌, శ్రీలంక‌ టెస్ట్‌కి 'రెస్ట్ డే' ఎందుకంటే..! 
శ్రీలంక‌లో అధ్యక్ష ఎన్నికల కారణంగా మొద‌టి టెస్టుకు 'రెస్ట్ డే'ను చేర్చ‌డం జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 21న శ్రీలంక అధ్యక్ష ఎన్నిక‌లు ఉండ‌డంతో ఆ రోజున 'రెస్ట్ డే' ఉండ‌నుంది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలి 'రెస్ట్ డే' టెస్ట్ మ్యాచ్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. 
 
చివరిసారి 2001లో కొలంబోలో జింబాబ్వేతో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌కు విశ్రాంతి దినాన్ని ఉప‌యోగించారు. ఇందులో శ్రీలంకలో పౌర్ణమి వేడుక అయిన పోయా డే కారణంగా 'రెస్ట్ డే'ను చేర్చారు. కాగా, ఈ విశ్రాంతి దినం అనేది సిరీస్‌లో ఆటగాళ్లకు అవసరమైన రికవరీ సమయాన్ని అందిస్తుంది. దాంతో జట్లు కోలుకోవడానికి, మిగిలిన రోజుల ఆట కోసం తమ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేసుకోవడానికి ఈ సమయం ఉప‌యోగ‌ప‌డుతుంది.


More Telugu News