ఇక 'స్పీడ్' గా... ప్రాజెక్టుల వేగవంతం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ - స్పీడ్ పేరుతో కార్యాచరణ
  • రాష్ట్రంలోని 19 ప్రాజెక్టులను స్పీడ్ పరిధిలోకి తీసుకువచ్చిన ప్రభుత్వం
  • నేరుగా సమీక్షలు జరపనన్న ముఖ్యమంత్రి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేయడానికి స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) పేరుతో కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రంలోని 19 ప్రాజెక్టులు దీని పరిధిలోకి తీసుకువచ్చింది. వీటిని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పర్యవేక్షిస్తారు. సంబంధిత అధికారులతో ఆయన నెలకోసారి ఈ ప్రాజెక్టులు, పనులపై సమీక్ష జరపనున్నారు.

ఆర్థికాభివృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులను, అవరోధాలను అధిగమించే అంశంపై 'స్పీడ్' దృష్టి సారిస్తుంది. ముఖ్యమంత్రి తరచూ సమీక్ష నిర్వహించడం వల్ల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. తన పరిధిలోకి వచ్చిన అన్ని ప్రాజెక్టులపై 'స్పీడ్' ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆన్ లైన్ పోర్టల్‌ను రూపొందిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరిగిన పనులకు సంబంధించిన డేటాను ఆ పోర్టల్‌లో పొందుపరచాలి. అలాగే ఎంతకాలం లోగా ఈ పనులు పూర్తవుతాయనే వివరాలు అందులో పొందుపరుస్తారు. ఎప్పటి వరకు ఏయే పనులు పూర్తవుతాయనే అంచనాలు కూడా ఉంటాయి.

'స్పీడ్' కిందకు వచ్చే 19 ప్రాజెక్టులు... 

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, శాటిలైట్ టౌన్ అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళా శక్తి పథకం, జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం, రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, ఐటీఐలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, కొత్త ఉస్మానియా ఆసుపత్రి, కొత్త నర్సింగ్-పారామెడికల్ కాలేజీలు, హెల్త్ టూరిజం ప్రమోషన్, ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్, టెంపుల్ సర్క్యూట్ టూరిజం, యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలు.


More Telugu News