అన్నమయ్య డ్యామ్ వరద బాధితులను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • 2021లో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన ఘటన
  • భారీగా ప్రాణనష్టం
  • నేడు పులపుత్తూరు గ్రామంలో పవన్ పర్యటన
  • వరద బాధితులకు పలు హామీలు ఇచ్చిన డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు అన్నమయ్య డ్యామ్ వరద బాధితులను పరామర్శించారు. 2021 నవంబరు 19న అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంతో ఊళ్లకు ఊళ్లే నామరూపాల్లేకుండా పోయాయి. నాడు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. 

ఈ నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. రాజంపేటలో ఆయనకు జనసైనికుల నుంచి ఘనస్వాగతం లభించింది. 

అనంతరం, ఆయన పులపుత్తూరు గ్రామానికి వెళ్లారు. అన్నమయ్య డ్యామ్ వరద బాధితులను కలిసి, వారిని పరామర్శించారు. వరద బీభత్సం తాలూకు ఫొటో ప్రదర్శనను తిలకించారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్... వరద బాధితులకు హామీలు ఇచ్చారు. ఇక్కడ 300 ఇళ్లు నిర్మిస్తామని, అందుకు సంబంధించి రూ.6 కోట్లు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. 5 సెంట్లు భూమి కోల్పోయి, కేవలం 1.5 సెంట్ల పరిహారం పొందినవారికి కచ్చితంగా 5 సెంట్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని పవన్ స్పష్టం చేశారు. 

వరద నష్టం జరగకుండా రక్షణ గోడ నిర్మాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పంట నష్టంపై పరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించి, మరోసారి పూర్తి స్థాయి నివేదిక అందించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... అన్నమయ్య డ్యామ్ వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. గత  ప్రభుత్వ తప్పులు సరిదిద్దేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని తెలిపారు.  వరద బాధితులు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వరద ముప్పు నుంచి గ్రామాలు, పంటల రక్షణకు కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పులపుత్తూరులో ఇళ్లు నిర్మిస్తామని, పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. 

అన్నమయ్య జిల్లాలో తన పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామసభకు కూడా హాజరయ్యారు.


More Telugu News