జమ్ము కశ్మీర్‌లో ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తు... రాహుల్ గాంధీకి 10 ప్రశ్నలు సంధించిన అమిత్ షా

  • కాంగ్రెస్ అధికార దాహంతో దేశ సమైక్యతను, భద్రతను పణంగా పెడుతోందని ఆరోపణ
  • అబ్దుల్లా కుటుంబానికి చెందిన పార్టీతో పొతతు ద్వారా కుటిల ఉద్దేశాలను బయటపెట్టిందని విమర్శ
  • ఎక్స్ వేదికగా 10 ప్రశ్నలను సంధించిన అమిత్ షా
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో పదేపదే దేశ సమైక్యత, భద్రతను పణంగా పెడుతోందని ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబానికి చెందిన ఎన్సీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ మరోసారి తన కుటిల ఉద్దేశాలను బయటపెట్టిందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీకి తాను 10 ప్రశ్నలు సంధిస్తున్నానన్నారు.

1. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక జెండాపై నేషనల్ కాన్ఫరెన్స్ వాగ్దానానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా?

2. ఆర్టికల్ 370, 35Aలను పునరుద్ధరించే జేకేఎన్‌సీ నిర్ణయానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా? తద్వారా జమ్ము కాశ్మీర్‌లో తిరిగి అశాంతి, ఉగ్రవాద యుగంలోకి నెట్టివేయాలనుకుంటుందా?

3. కశ్మీర్ యువతతో కాకుండా పాకిస్థాన్‌తో చర్చలు జరపడం ద్వారా మళ్లీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుందా?

4. పాకిస్థాన్‌తో 'ఎల్‌ఓసీ ట్రేడ్' ప్రారంభించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది... తద్వారా సరిహద్దు వెంబడి ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనే నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారా?

5. తీవ్రవాదం, రాళ్లతో దాడికి పాల్పడిన వారి బంధువులను ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తిరిగి చేర్చుకోవడానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా?

6. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ఇండియా కూటమి బట్టబయలు చేసింది. దళితులు, గుజ్జర్లు, బకర్వాల్, పహాడీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని, తద్వారా వారికి అన్యాయం చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చెబుతోంది. అలాంటి పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తోందా?

7. 'శంకరాచార్య కొండ'ను 'తఖ్త్-ఎ-సులేమాన్'గా, 'హరి కొండ'ను 'కోహ్-ఎ-మారన్'గా పిలవాలని కాంగ్రెస్ కోరుకుంటుందా?

8. జమ్ము కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను తిరిగి అవినీతిలోకి నెట్టి... పాకిస్థాన్ మద్దతు కలిగిన కుటుంబాలకు పాలనా బాధ్యతలను అప్పగించే రాజకీయాలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా?

9. జమ్ము, కశ్మీర్ లోయ మధ్య వివక్ష రాజకీయాలకు పాల్పడుతున్న జేకేఎన్‌సీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా?

10. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి దిశగా నేషనల్ కాన్ఫరెన్స్ విభజన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.


More Telugu News