కేసీఆర్, కేటీఆర్, కవితలకు జీవితాంతం మా పార్టీతో ఎలాంటి సంబంధం ఉండదు: ధర్మపురి అరవింద్

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతుంటే బీజేపీలో విలీనం అనడమేమిటని ప్రశ్న
  • మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందేనని బండి సంజయ్ చెప్పారన్న అరవింద్
  • ట్రిపుల్ "కే"ను బీజేపీ దరిదాపుల్లోకి రానీయమని వ్యాఖ్య
  • పార్టీని గెలిపించేవారు బీజేపీ అధ్యక్షుడిగా ఉండాలన్న ఎంపీ
కేసీఆర్, కేటీఆర్, కవితలకు బీజేపీతో జీవితాంతం ఎలాంటి సంబంధం ఉండదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... "మీ ఛానళ్లన్నీ... బీజేపీలో బీఆర్ఎస్ విలీనం... బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని చూపిస్తున్నాయి. మీకు అలా ఎవరైనా చెప్పారా?" అని మీడియాను ప్రశ్నించారు.

ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్లడం... ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వెళ్లడం.. నేటి రాజకీయాలు ఇలా సాగుతున్నాయన్నారు. కానీ ఈ ముగ్గురికి మాత్రం బీజేపీతో జీవితాంతం ఎలాంటి సంబంధం ఉండబోదన్నారు. అందులో ఎలాంటి ప్రశ్నే లేదన్నారు.

వేరేవాళ్లు ఎవరు ఎటు దూకుతారో... ఎటు వెళతారో... అవన్నీ నడుస్తుంటాయన్నారు. అయినా వేరే ఎమ్మెల్యేలు (బీఆర్ఎస్ పార్టీకి చెందిన) కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా అన్నారు. ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా వెళ్లి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారని గుర్తు చేశారు. ఇంత జరుగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ విలీనం అనడమేమిటన్నారు. మీరు (జర్నలిస్టులు) ఎవరితోనైనా విలీనమయ్యారా? అని ప్రశ్నించారు.

అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. కానీ బీజేపీని అనడమేమిటన్నారు. మా పార్టీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేసి రావాలని తమ పార్టీ నేత బండి సంజయ్ చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పేశారన్నారు. ట్రిపుల్ 'కే'... కేసీఆర్, కేటీఆర్, కవితలను బీజేపీ దరిదుపుల్లోకి కూడా రానీయమన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా కావాలన్నారు. ఇందులో మరో ఆలోచన లేదన్నారు. ఒకటే చెబుతున్నాం... గెలిపించే వ్యక్తి అధ్యక్షుడు కావాలన్నారు.


More Telugu News