కూకట్‌పల్లిలో నడిరోడ్డుపై రూ. 50 వేల విలువైన నోట్లు గాల్లోకి విసిరిన యూట్యూబర్ హర్ష.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. ట్రాఫిక్ జామ్.. వీడియో ఇదిగో!

  • మున్ముందు మరింత డబ్బు వెదజల్లుతానంటూ వీడియో
  • తన టెలిగ్రామ్ చానల్‌లో జాయిన్ అయి తాను ఎగరేయబోయే డబ్బును ఊహించి చెప్తే రివార్డులు ఇస్తానని ప్రకటన
  • అతడిని అరెస్ట్ చేసి బుద్ధి చెప్పాలని నెటిజన్ల డిమాండ్
నిత్యం రద్దీగా ఉండే కూకట్‌పల్లి రోడ్డులో యూట్యూబర్ పవర్ హర్ష అలియాస్ మాహదేవ్ 50 వేల రూపాయల విలువైన నోట్లను గాల్లోకి ఎగరేసిన వీడియో వైరల్ అవుతోంది. అతడు నోట్లు ఎగురవేసిన వెంటనే జనం వాటిని చేజిక్కించుకునేందుకు పోటీ పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది.  ఈ వీడియోపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత రహితంగా, ప్రమాదకరంగా వ్యవహరించే ఇలాంటి వారిని ఉపేక్షించకూడదంటూ తెలంగాణ డీజీపీని కోరుతున్నారు. 

మరోవైపు, యూట్యూబర్ హర్ష మాత్రం ఇక్కడితో ఆగేది లేదని, ఇంకా ఇంకా డబ్బులు వెదజల్లుతానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తన టెలిగ్రామ్ చానల్‌లో జాయిన్ అయి ఇకపై తాను గాల్లోకి ఎగరేయబోయే డబ్బులు ఎంతో ఊహించి రివార్డులు అందుకోవచ్చని కూడా పురికొల్పాడు. 

నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలు ప్రమాదాలకు కారణమవుతాయన్న ఆందోళన సర్వత్ర వ్యక్తమైంది. కాబట్టి యూట్యూబర్‌ను అరెస్ట్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే యూట్యూబర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.


More Telugu News