కంపెనీలు బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు: సీఎం చంద్రబాబు

  • అచ్యుతాపురం సెజ్ లో ఓ ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం
  • 17 మంది మృతి
  • బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
  • ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటన స్థలిని సందర్శించిన వైనం
అచ్యుతాపురం సెజ్ లో ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం తెలిసిందే. నేడు బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు... ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెడ్  క్యాటగిరీలోని పరిశ్రమలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పరిశ్రమలు బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని అన్నారు. బాధిత కుటుంబాలకు కంపెనీ పరిహారం చెల్లిస్తుందని తెలిపారు.

ఘటనలు జరిగినప్పుడు పరిశ్రమలు వెంటనే అంతర్గత విచారణ జరపాలని ఉద్ఘాటించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోతే ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. పరిశ్రమలో ఏం జరిగింది... ప్రమాదం వెనుక కారణాలేంటి, లోపాలపై ఈ కమిటీ విచారిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, పరిశ్రమలకు ఉన్న ఇబ్బందులపైనా కమిటీ విచారిస్తుందని వివరించారు. కమిటీ నుంచి నివేదిక వచ్చాక, ఎవరు తప్పు చేసినట్టు తేలినా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. 

బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని, ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రమాదాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని, ఎవరైనా కుట్రలు చేసినా ఎక్కువ రోజులు సాగవని హెచ్చరించారు.


More Telugu News