బంగ్లాదేశ్ వరదలకు మా డ్యాం కారణం కాదు: భారత్

  • త్రిపుర, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరదలు వచ్చాయన్న భారత్
  • త్రిపురలోని డుంబూర్ డ్యామ్‌ను తెరవడం వల్ల వరదలు వచ్చాయన్నది అవాస్తవమని వెల్లడి
  • ఈ డ్యామ్ బంగ్లాదేశ్‌కు దూరంగా ఉంటుందని, తక్కువ ఎత్తులో ఉంటుందని వెల్లడి
బంగ్లాదేశ్‌లో వరద బీభత్సానికి త్రిపురలోని డుంబూర్ డ్యామ్ కారణమనే ఆరోపణలను భారత్ ఖండించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆ దేశ తూర్పు ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ వరదలకు భారత్‌లోని త్రిపుర డ్యామ్ కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

త్రిపురలోని గోమతి నదికి ఎగువన ఉన్న డుంబూర్ డ్యామ్‌ను తెరవడం వల్లే... బంగ్లాదేశ్ తూర్పు సరిహద్దు జిల్లాల్లో ఈ వరద పరిస్థితి తలెత్తిందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ ఇది వాస్తవం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే గోమతి నది పరివాహక ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ఈ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా ఈ డ్యామ్ దిగువ ఉన్న పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన నీటి కారణంగా బంగ్లాదేశ్‌లో వరద పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది. కానీ డ్యామ్ తెరవడం వల్ల కాదని పేర్కొంది.

సరిహద్దుకు ఈ డుంబూర్ డ్యామ్ చాలా దూరంలో ఉంటుంది తెలిపింది. బంగ్లాదేశ్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉందని, పైగా ఈ డ్యామ్ ఎత్తు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 40 మెగావాట్లను బంగ్లాదేశ్ వినియోగించుకుంటోందని తెలిపింది. త్రిపుర, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆగస్ట్ 21 నుంచి భారీ వర్షం కురుస్తోందని గుర్తు చేసింది. డ్యాంలో నీటి ఉద్ధృతి గురించిన సమాచారాన్ని బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు అందించామని తెలిపింది. వరదల కారణంగా ఏర్పడిన విద్యుత్ అంతరాయం వల్ల సమాచార పంపిణీలో ఆ తర్వాత సమస్యలు ఏర్పడినట్లు తెలిపింది.

భారత్, బంగ్లాదేశ్‌లు 54 ఉమ్మడి సరిహద్దు నదులను పంచుకుంటున్నాయని, నదీజలాల సహకారం మన ద్వైపాక్షిక ఒప్పందంలో ముఖ్యమైన భాగమని భారత్ పేర్కొంది. ద్వైపాక్షిక సంప్రదింపులు, సాంకేతిక చర్చల ద్వారా నీటి వనరులు, నదీ జలాల నిర్వహణలో సమస్యలు, పరస్పర ఆందోళనలను పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది.

ఇదిలా ఉండగా, భారీ వర్షాల వల్ల త్రిపురలోనూ భారీ వరదలు సంభవించాయి. ఇప్పటి వరకు 34 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటం, నీటిలో కొట్టుకుపోవడం వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. గోమతి నది అత్యంత ప్రమాదకరస్థాయిని దాటింది.


More Telugu News