అరంగేట్ర మ్యాచ్‌లోనే.. భార‌త మాజీ క్రికెట‌ర్ 41 ఏళ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన శ్రీలంక‌న్‌!

  • 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు (72) నమోదు చేసిన మిలన్ రత్నాయకే
  • త‌ద్వారా టెస్టు క్రికెట్‌లో 41 ఏళ్ల నాటి బల్వీందర్ సంధు రికార్డు బ్రేక్‌
  • 1983లో హైదరాబాద్‌లో పాకిస్థాన్‌పై 71 పరుగులు చేసిన భారత ఆటగాడు 
ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన శ్రీలంక ఆటగాడు మిలన్ రత్నాయకే ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు (72) నమోదు చేసిన‌ బ్యాటర్‌గా నిలిచాడు. త‌ద్వారా టెస్టు క్రికెట్‌లో 41 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. 

1983లో హైదరాబాద్‌లో పాకిస్థాన్‌పై 71 పరుగులు చేసి భారత ఆటగాడు బల్వీందర్ సంధు నెలకొల్పిన రికార్డును రత్నాయకే అధిగమించాడు. అలాగే అరంగేట్ర మ్యాచ్‌లోనే ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఆట‌గాడిగానూ చ‌రిత్ర‌కెక్కాడు. 

ఇక మాంచెస్టర్ వేదిక‌గా జ‌ర‌గుతున్న ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక‌ను ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ద్వ‌యం క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్ బెంబేలెత్తించారు. వీరి ధాటికి లంకేయులు 113 ప‌రుగుల‌కే 7 వికెట్లు పారేసుకున్నారు. 

ఇలా శ్రీలంక పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన మిలన్ రత్నాయకే 135 బంతుల్లో 72 పరుగులు చేశాడు. శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 63 పరుగుల అమూల్య‌మైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివ‌రికి స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో రత్నాయకే పెవిలియ‌న్ చేరాడు.


More Telugu News