డాక్టర్ల డిమాండ్లకు దిగొచ్చిన బెంగాల్ ప్ర‌భుత్వం.. ఆర్‌జీ క‌ర్ ఆసుప‌త్రి అధికారుల బ‌దిలీ!

  • దేశ‌వ్యాప్తంగా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌లు
  • ఆర్జీ కర్‌ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ పదవి నుంచి తొలగింపు
  • నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా సుహ్రితా పాల్‌
  • ఆర్జీ కర్ ప్రిన్సిపల్ గా మానస్ కుమార్ బంధోపాధ్యాయ నియామకం
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆమెకు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఈ నిర‌స‌న‌ల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ ప్రభుత్వం దిగొచ్చింది. ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలోని ముగ్గురు ఉన్న‌తాధికారుల‌పై బ‌దిలీ వేటు వేసింది. ఈ మేరకు బెంగాల్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

వారిని, వివిధ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు ట్రైనీ డాక్ట‌ర్‌ మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, బదిలీ అయిన ఆర్జీ కర్‌ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్ ఘో‌ష్ ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు నిగమ్ వెల్ల‌డించారు.

"ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనపై జూనియ‌ర్ డాక్ట‌ర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారి డిమాండ్ల మేరకు పలు చర్యలు తీసుకున్నాం. డాక్టర్లు వైద్యసేవలు కొనసాగించాలని మ‌న‌వి చేస్తున్నాం. డాక్టర్ల డిమాండ్ల మేరకు ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశాం. ప్రస్తుత పరిస్థితి సాధారణ స్థితికి రావాలని కోరుతున్నాం" అని ఎన్‌ఎస్ నిగమ్ తెలిపారు.

ఇక ప్రస్తుతం నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా కొన‌సాగుతున్న సందీప్ ఘోష్ నియామకాన్ని రాష్ట్ర‌ ఆరోగ్య శాఖ రద్దు చేసింది. ఆయ‌న స్థానంలో ఆర్జీ కర్ ప్రస్తుత ప్రిన్సిపల్ సుహ్రితా పాల్‌ను మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా బదిలీ చేసింది. అలాగే ఆమె స్థానంలో ఆర్జీ కర్ ప్రిన్సిపల్ గా మానస్ కుమార్ బంధోపాధ్యాయ నియమితుల‌య్యారు. 

దీంతో పాటు ఆర్జీ కర్ ఆసుపత్రి వైస్ ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండెంట్ బుల్బుల్ ముఖోపాధ్యాయ స్థానంలో సప్తర్షి ఛటర్జీని నియమించింది. అలాగే ఆర్‌జీకేఎంసీహెచ్ ఔషధ విభాగం అధిపతి అరుణాభ దత్తా చౌధురిని మాల్దా మెడికల్ క‌ళాశాల‌కు బదిలీ చేస్తూ ఆరోగ్య‌శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.


More Telugu News