కోల్‌కతా హత్యాచార ఘటన.. సమాజం ఆన్సర్ చెప్పలేని ప్రశ్నలు సంధించిన సోనాగచ్చి సెక్స్ వర్కర్.. వీడియో ఇదిగో!

  • సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఉండగా మహిళలపై అఘాయిత్యాలు దారుణమన్న సెక్స్ వర్కర్
  • రూ.20-30 ఇచ్చినా వారి కోరికను సంతృప్తి పరుస్తామన్న మహిళ
  • రెడ్‌లైట్ ఏరియాలు లేకపోతే సమాజం పరిస్థితి ఏంటని సూటి ప్రశ్న
  • సామాజిక రుగ్మతలను సవాలు చేసి ఆలోచింపజేసిన సెక్స్ వర్కర్
సోనాగచ్చి.. కోల్‌కతా పరిచయం ఉన్న వారికి ఈ పేరు సుపరిచితం. ముంబైలోని రెడ్‌లైట్ ఏరియాలనే ఇది కూడా బాగా పేరుమోసింది. నిజానికి ఇలాంటి ప్రాంతాలపై పోలీసులు తరచూ దాడులు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల పేరు ఎత్తడానికి కొందరు జంకితే.. మరికొందరు అటువైపు వెళ్లలేకుండా ఉండలేని స్థితిలో ఉంటారు.

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత సోనాగచ్చికి చెందిన ఓ సెక్స్ వర్కర్ చేసిన వ్యాఖ్యలు సమాజంలోని పోకడలకు అద్దం పడుతున్నాయి. సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఎందుకు ఉండాలో చెప్పిన ఆమె వ్యాఖ్యల వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఓ మీడియా ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ ‘‘మీ కోరికను తృప్తిపరుచుకోవాలంటే సోనాగచ్చి రండి. ఇలా చదువుకున్న అమ్మాయిలు, పనిచేసుకుంటున్న మహిళలపై దారుణాలకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? 20, 30 రూపాయలు ఇచ్చినా పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ల వెంటపడి ఉసురు తీస్తారు ఎందుకు?’’ అని ప్రశ్నించింది. సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఉండగా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుండడాన్ని ఆమె వ్యాఖ్యలు ఎత్తిచూపాయి.

నిజానికి సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఎప్పటికీ వివాదాస్పదమే. ఇవి సమాజాన్ని నాశనం చేస్తున్నాయన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది. ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటాయి. ఇలాంటివి లేకపోతే సమాజంలో జరిగే అరాచకాలను ఊహించుకోలేరని ఆమె వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయి. రెడ్‌లైట్ ఏరియాలు అక్కడక్కడా ఉండడం వల్లే మహిళలకు కొంతైనా భద్రత లభిస్తోందన్న భావన ఆమె మాటల్లో వ్యక్తమైంది.

కామవాంఛ గల పురుషుల నుంచి ఇలాంటి ప్రాంతాలు మహిళలను రక్షిస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చింది. నిజానికి సోనాగచ్చి లాంటి వాటిని చెడుగా చూస్తారు. ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలనుకుంటున్న ప్రభుత్వాలు ఆమె ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతాయన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. పురుషులకు రెడ్‌లైట్ ఏరియాలు ఎందుకు అవసరమన్న మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. రెడ్ లైట్ ఏరియాలు లేకుండా మహిళలు బతకగలిగినప్పుడు.. పురుషులు ఎందుకు ఆ పనిచేయలేరు.. అని ప్రశ్నించి సామాజిక రుగ్మతలను సవాలు చేసింది.


More Telugu News