నేడు అచ్యుతాపురం ప్రమాద స్థలానికి సీఎం చంద్రబాబు .. విశాఖ టూర్ షెడ్యూల్ ఇలా..!

  • రియాక్టర్ పేలుడు ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య
  • క్షతగాత్రులు, బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరామర్శ
  • ప్రమాద ఘటన ప్రాంతాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు (గురువారం) అచ్యుతాపురం వెళ్లనున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ లో రియాక్టర్ పేలుడుతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు వెళుతున్నారు. 
 
ఉదయం 10.30 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుండి చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. 11.40 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి నావల్ కోస్టల్ బ్యాటరీ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా 12.10కి వెంకోజిపాలెం మెడికవర్ ఆసుపత్రికి చేరుకుంటారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించి, వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. 

అనంతరం సీఎం చంద్రబాబు కోస్టల్ బ్యాటరీకి చేరుకొని హెలికాఫ్టర్ లో అచ్యుతాపురం సెజ్ కి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్ పోర్టు నుండి విజయవాడ బయలుదేరి ఉండవల్లి నివాసానికి సాయంత్రం 4.20కి చంద్రబాబు చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.


More Telugu News