అనకాపల్లి ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ విచారం.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

  • ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి
  • ఎక్స్ వేదిక‌గా మృతుల‌కు సంతాపం తెలిపిన‌ ప్రధాని మోదీ 
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో 17 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తన సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.

"అనకాపల్లిలోని ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో భారీ మొత్తంలో ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌డం తీవ్రంగా బాధించింది. దగ్గరి, ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.  మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్‌ నుండి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జ‌రుగుతుంది. అలాగే క్షతగాత్రులకు రూ. 50,000 అందజేస్తాం" అని పీఎంవో ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఘ‌ట‌నాస్థ‌లిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగలు రెస్క్యూ టీమ్‌లను ప్రాంగణంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయని, చాలా మంది వ్యక్తులు లోపల చిక్కుకున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న‌ వారిని చేరుకోవడానికి బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని మంత్రి చెప్పారు.


More Telugu News