డాక్టర్ చదవడానికి నా కూతురు ఎంతో కష్టపడింది: కోల్‌కతా డాక్టర్ తండ్రి కన్నీరుమున్నీరు

  • తన కూతురు చదువే లోకంగా బతికిందన్న డాక్టర్ తండ్రి
  • తన కూతురు డాక్టర్ కావడంతో ఎంతో సంతోషించామన్న తండ్రి
  • వైద్య వృత్తితో ఎంతోమందికి సాయం చేయవచ్చునని చెప్పేదన్న తండ్రి
తమది నిరుపేద కుటుంబమని, తన కూతురు డాక్టర్ చదవడానికి ఎంతో కష్టపడిందని, కానీ ఒక్క రాత్రిలోనే ఆమె కలలు కల్లలయ్యాయని హత్యాచారానికి గురైన కోల్‌కతా జూనియర్ డాక్టర్ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఆ తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన కూతురు చదువే లోకంగా బతికిందన్నారు. డాక్టర్ కావడానికి ఎంతో కష్టపడి అనుకున్న లక్ష్యం నెరవేరడంతో తామంతా ఎంతో సంతోషించామన్నారు.

వైద్య వృత్తితో ఎంతోమందికి సాయం చేయవచ్చునని తమతో చెప్పేదని, కానీ ఇప్పుడేం జరిగిందో చూడండంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తాము విధుల నిర్వహణ కోసం పంపిస్తే... ఆసుపత్రి మాత్రం విగతజీవిగా పంపించిందన్నారు. తన కూతురు స్వరాన్ని, చిరునవ్వునూ తాను ఎప్పటికీ వినలేనన్నారు. ఇప్పుడు తమకు న్యాయం జరగడం ఒక్కటే మిగిలి ఉందన్నారు.

మమతా బెనర్జీ రాజీనామా చేయాలి: బీజేపీ

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. మమత విశ్వసనీయతను కోల్పోయారన్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాఫ్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సిట్‌ను ఏర్పాటు చేసింది.


More Telugu News