మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్

  • ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని ఆసుపత్రులకు ఆదేశం
  • ఎంపాక్స్ రోగులతో సన్నిహితంగా మెలిగితే పరీక్షలు నిర్వహించాలన్న ఎయిమ్స్
  • జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి... ఎంపాక్స్ లక్షణాలు
ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్‌పై ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది. 

అయితే మంకీపాక్స్ సోకిన రోగిని ఇప్పటి వరకు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. భారత్‌లో ఎంపాక్స్ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

జ్వరం, దద్దుర్లుతో బాధపడుతున్న వారిని, ఎంపాక్స్ రోగులతో సన్నిహతంగా మెలిగే వారికి పరీక్షలు నిర్వహించాలని ఎయిమ్స్ పేర్కొంది. ఎంపాక్స్ లక్షణాలున్న వారికి స్క్రీనింగ్, ఐసోలేషన్, చికిత్సపై మార్గదర్శకాలు జారీ చేసింది. 

జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, శోషరస గ్రంథుల వాపు, చలి, అలసట వంటివి ఉండటం కూడా ఎంపాక్స్ లక్షణాలు కావొచ్చు. అనుమానిత రోగులకు ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేయాలి. రోగులను సఫ్థర్ జంగ్ ఆసుపత్రికి తరలించే వరకు ఐసోలేషన్ ప్రాంతాల్లో ఉంచాలి. 

రోగులను ఎయిమ్స్ సఫ్థర్ జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేస్తుంది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో చికిత్స చేస్తారు. సఫ్థర్ జంగ్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను కేటాయించారు. అనుమానిత రోగిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించడానికి ఎమర్జెన్సీ స్టాఫ్... అంబులెన్స్ కోఆర్డినేటర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తుంది.


More Telugu News