తాడిపత్రిలో ఉద్రిక్తత... వైసీపీ నేత మురళి ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి

  • చాలారోజుల తర్వాత తాడిపత్రి వచ్చిన పెద్దారెడ్డి
  • టీడీపీ నేతల పట్ల కవ్వింపులకు పాల్పడిన వైసీపీ శ్రేణులు
  • వైసీపీ నేత ఇంటిపై దాడి చేసి వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు
  • మురళి తుపాకీ చూపించి రెచ్చగొట్టాడన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్నికల తర్వాత చాలామంది వైసీపీ నేతలు సొంత నియోజకవర్గాలను వీడారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా చాలా రోజులుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. 

అయితే, ఇవాళ ఆయన తాడిపత్రిలోని తన సొంత నివాసానికి రావడంతో, వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. టీడీపీ నేతల పట్ల కవ్వింపులకు దిగారు. దాంతో టీడీపీ శ్రేణులు కూడా దీటుగా స్పందించాయి. 

వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ వర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఇంటి ముందు నిలిపిన వాహనాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇంట్లో ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. అంతకుముందు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేత రఫీని చితకబాదారు. అయినప్పటికీ వైసీపీ నేతలు కవ్వింపులు ఆపకపోవడంతో మురళి ఇంటిపై దాడికి దిగారు. 

దాంతో, జోక్యం చేసుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించారు. తాను కొన్ని డాక్యుమెంట్ల కోసం తాడిపత్రి నివాసానికి వచ్చానని పెద్దారెడ్డి వెల్లడించారు. 

దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మురళి తుపాకీ చూపించడం వల్లే తమ కార్యకర్తలు రెచ్చిపోయారని వెల్లడించారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తున్నాడని తెలిసినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. 

పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడంతోనే వైసీపీ కార్యకర్తలు తమ కార్యకర్తలను రెచ్చగొట్టారని జేసీ వివరించారు. అందుకే తమ కార్యకర్తలు గట్టిగా సమాధానం చెప్పారని తెలిపారు. తాడిపత్రి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని... పోలీసులు కూడా అందుకు సహకరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు.


More Telugu News