బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి 3 నెలల ముందు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ప్రాక్టీస్ మ్యాచ్‌ను 2 రోజులకు కుదించడంపై విమర్శలు గుప్పించిన మాజీ దిగ్గజం
  • అక్కడికి వెళుతున్నది ఆడడానికి... విశ్రాంతి తీసుకోవడానికి కాదని వ్యాఖ్య
  • యువ ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు ఎలా అలవాటుపడాలని ప్రశ్న
  • మూడు రోజులకు పెంచేందుకు సమయం మిగిలే ఉందని సూచన 
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌ ఆరంభానికి మరో మూడు నెలల సమయం ఉంది. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆ తర్వాత అక్టోబరులో న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌లను భారత్ ఆడనుంది. అనంతరం ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షురూ అవుతుంది. 

అయితే ఆసీస్‌లో పర్యటించనున్న భారత్ జట్టు సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ జట్టుతో ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్‌ను ఆడనుంది. ఆ తర్వాత నేరుగా సిరీస్ మొదలుకానుంది. అయితే ఆ ఏకైక ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా 2 రోజులు మాత్రమే జరగనుంది. ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌ అయినా రెండు రోజులు మాత్రమే ఆడేలా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు  నిర్ణయించడమే ఇందుకు కారణమైంది.

మరోవైపు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ జట్టులో సీనియర్ ప్లేయర్లు కూడా ఆడడం లేదని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

విదేశీ జట్లు ఆస్ట్రేలియాలో పర్యటించేది విశ్రాంతి తీసుకోవడానికి కాదని, క్రికెట్ ఆడడానికి అని అన్నారు. భారత జట్టులో కొందరు యువ క్రికెటర్లు ఉంటారని భావిస్తున్నందున.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా ప్రాక్టీస్ మ్యాచ్ ఫార్మాట్‌‌లో మార్పులు చేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును గవాస్కర్ కోరారు. 

‘‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రతీకారంతో ఉన్నారు. మరోవైపు హ్యాట్రిక్ సిరీస్ విజయం సాధించాలని భారత ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌ను మూడు రోజులకు మార్చేందుకు సమయం మిగిలే ఉంది. అనుభవం లేని ఆటగాళ్లకు ప్రాక్టీస్ రూపంలో మంచి అవకాశం కల్పించాలి’’ అని గవాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ‘మిడ్-డే’కి రాసిన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

కాగా 1992 తర్వాత మొదటిసారిగా పెర్త్, అడిలైడ్ (డే-నైట్ టెస్ట్), బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీ వేదికలుగా భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌‌ను ఆసీస్ 3-1తో గెలుచుకుటుందని ఆ దేశ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఇక 2018/19, 2020/21లో వరుసగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను భారత్ సాధించింది.


More Telugu News