తెర‌పైకి యువరాజ్‌ సింగ్‌ బయోపిక్.. టీ-సిరీస్ అధికారిక ప్ర‌క‌ట‌న‌!

  • యువీ క్రీడా ప్ర‌యాణాన్ని మూవీగా తీసుకువ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ టీ-సిరీస్
  • 2007 టీ20 ప్రపంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెల‌వ‌డంలో యువ‌రాజ్ కీరోల్‌
  • ఆ తర్వాత‌ క్యాన్స‌ర్ బారిన‌ప‌డి.. ఏడాదిలోనే దాన్ని జ‌యించి మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్టిన‌ యువీ
  • త‌న జీవిత క‌థ సినిమాగా రావ‌డం ప‌ట్ల హర్షం వ్య‌క్తం చేసిన టీమిండియా మాజీ క్రికెట‌ర్‌
భారతీయ క్రికెట్‌ చరిత్రలో అతడో సంచలనం. అలాగే వ్యక్తిగతంగాను ఎంతోమందికి ఆదర్శం. అత‌డే టీమిండియా మాజీ క్రికెట‌ర్,  ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌. ఆ మ‌ధ్య‌లో యువీ జీవిత చరిత్ర మూవీగా రాబోతున్నట్లు బాగా ప్రచారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అత‌ని అభిమానుల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చింది. 

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్, యువ‌రాజ్ బయోపిక్‌ను నిర్మించనుంది. నిర్మాతలు భూషణ్‌ కుమార్‌, రవిభాగ్ చందక్ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అత‌ని క్రీడా ప్ర‌యాణాన్ని మూవీగా తీసుకురానున్న‌ట్లు నిర్మాణ సంస్థ‌ టీ-సిరీస్ ప్ర‌క‌టించింది. 

అయితే హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? టైటిల్ ఏంటి? అనే విష‌యాల‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

కాగా, 13 ఏళ్ల వయసులో పంజాబ్ అండర్ 16 క్రికెట్ జట్టకు ఎంపికైన యువరాజ్ ఆ తర్వాత 2000లో అండర్ 19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. ఇందులో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. అనంతరం టీమిండియాకు ఎంపికై 2007 టీ 20 వరల్డ్ కప్ విజయంలో కీరోల్ పోషించాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది సరికొత్త ప్ర‌పంచ‌ రికార్డు సృష్టించాడు.

ఆ త‌ర్వాత 2011లో భార‌త జ‌ట్టు 28 ఏళ్ల త‌ర్వాత వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలోనూ ఆల్‌రౌండ‌ర్‌గా యువీనే కీల‌కంగా వ్య‌వ‌హరించాడు. అదే ఏడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. అయినా అధైర్య పడకుండా పోరాటం చేసి క్యాన్సర్ను జయించాడు. ఆ తర్వాత 2012 మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఇలా ప‌డిలేచిన కెర‌టంలా అతడి జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. 

త‌న మూవీ గురించి యువ‌రాజ్ సింగ్ మాట్లాడుతూ.. "భూష‌ణ్‌కుమార్‌, ర‌వి ద్వారా ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న నా కోట్లాది మంది అభిమానుల‌కు నా జీవిత క‌థను అందిస్తుండ‌టం చాలా గౌర‌వంగా భావిస్తున్నాను. నా జీవితంలో క్రికెట్‌కు ఎప్పుడూ అత్యున్న‌త స్థానం ఉంటుంది. ఇక నా ఒడిదుడుకుల జీవిత పాఠం ఇత‌రుల‌ను వారి సొంత స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డానికి, అచంచ‌ల‌మైన అభిరుచితో వారి క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి స్ఫూర్తిని ఇస్తుంద‌ని ఆశిస్తున్నాను" అని యువీ అన్నాడు.  

ఇక నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ఇప్ప‌టికే తారే జ‌మీన్ ప‌ర్‌, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' డాక్యుమెంటరీ నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితాన్ని తెరపైకి తీసుకువ‌స్తున్నారు. దీంతో ఈ బ‌యోపిక్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.


More Telugu News