ఇంటి బయట మాట్లాడుకుంటున్న యువకులపై పడిన ఏసీ యూనిట్.. ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం.. వీడియో ఇదిగో!

  • ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఘటన
  • స్కూటర్‌పై కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా నెత్తిపై పడిన ఏసీ యూనిట్
  • తన తప్పేమీ లేదని. కోతుల పనేనన్న యజమాని
  • చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న యువకుడు ఆయన కుమారుడే
న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంటి బయట మాట్లాడుతున్న 18 ఏళ్ల యువకుడిపై రెండో అంతస్తు నుంచి ఏసీ యూనిట్ పడడంతో మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎక్కడికో వెళ్లేందుకు బయటకు వచ్చిన యువకుడు స్కూటర్ తీసి స్నేహితుడితో మాట్లాడుతుండగా గోడకు బిగించిన ఏసీ అవుట్ డోర్ యూనిట్ ఒక్కసారిగా వారిపై పడింది. మృతుడిని జితేశ్‌గా గుర్తించగా, ఆసుపత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని ప్రన్షు(17)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటనలో తన తప్పేమీ లేదని, అంతా కోతుల పనేనని రెండో అంతస్తులో ఉండే ఏసీ యజమాని చెబుతున్నాడు. ఈ ప్రాంతంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. కింద మనుషులు ఉండడంతో ఏసీపైకి ఎక్కిన కోతులు దానిని పట్టుకుని వేలాడడంతో అది పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రన్షు ఆయన కుమారుడే!


More Telugu News