ఆ బాధ్య‌త అథ్లెట్ల‌దే.. వినేశ్ ఫోగాట్ అప్పీల్ తిర‌స్క‌ర‌ణ‌కు కార‌ణం చెప్పిన 'కాస్‌'

  • ఫైన‌ల్ పోటీలకు ముందు 100 గ్రాముల అధిక బరువు కార‌ణంగా వినేశ్‌పై అన‌ర్హ‌త వేటు
  • దాంతో  కాస్‌ లో అప్పీల్ చేసుకున్న స్టార్ రెజ్ల‌ర్ 
  • ఈ నెల 14న ఆమె అప్పీల్‌ను తిరస్కరించిన‌ కాస్ 
  • త‌మ బ‌రువు ప‌రిమితి లోపు ఉండేలా చూసుకునే బాధ్య‌త అథ్లెట్ల‌దేన‌న్న కోర్టు
  • ఎట్టిప‌రిస్థితుల్లోనూ మిన‌హాయింపు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
పారిస్ ఒలింపిక్స్ లో ప‌త‌కం ఖాయ‌మ‌నుకున్న‌ స‌మ‌యంలో రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్ మ‌హిళ‌ల 50 కిలోల ఫ్రీస్టైల్‌ ఫైన‌ల్ పోటీలకు ముందు అన‌ర్హ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు కార‌ణంగా ఆమెపై అనూహ్యంగా అన‌ర్హ‌త వేటు ప‌డింది. దాంతో ఈ స్టార్ రెజ్ల‌ర్ ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్ ఫ‌ర్ స్పోర్ట్స్ (కాస్‌) లో అప్పీల్ చేసుకున్నారు. కనీసం తనకు ర‌జ‌త ప‌త‌కం అయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ అప్పీల్ ను పరిగణనలోకి తీసుకున్న కాస్ దాన్ని విచారించింది. వాయిదాలు వేస్తూ చివరికి ఈ నెల 14న కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. దానికి గ‌ల కార‌ణాన్ని తాజాగా కాస్ వివ‌రించింది. త‌మ బ‌రువు ప‌రిమితికి అనుగుణంగా ఉండేలా చూసుకోవ‌డం అథ్లెట్ల బాధ్య‌త అని, ఎట్టిప‌రిస్థితుల్లోనూ మిన‌హాయింపు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. 

'నిబంధ‌న‌లు స్ప‌ష్టంగా ఉన్నాయి. బ‌రువు విష‌యంలో రూల్స్ అంద‌రికీ ఒక‌టే. ఎవ‌రికీ మిన‌హాయింపు ఉండ‌దు. ప‌రిమితి దాట‌కుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్య‌త అథ్లెట్ల‌దే' అని కాస్ వివ‌రించింది. దీంతో వినేశ్ ఒలింపిక్స్ ప‌త‌కం ఆశ‌లు ఆవిర‌య్యాయి. కాగా, వ‌రుస‌గా మూడు మ్యాచులు గెలిచి ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లిన ఆమెకు క‌నీసం ర‌జ‌త ప‌త‌క‌మైనా ఇవ్వాల‌ని అంద‌రూ డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే.


More Telugu News