రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ వ్యాఖ్యలు... తీవ్రంగా స్పందించిన వీహెచ్

  • సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేస్తే తొలగిస్తామన్న కేటీఆర్
  • నీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిందే రాజీవ్ గాంధీ అంటూ వీహెచ్ కౌంటర్
  • నీ స్థాయిని తగ్గించుకునే మాటలు మాట్లాడవద్దని హితవు
తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. "కేటీఆర్... నీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిందే రాజీవ్ గాంధీ. నీ స్థాయిని తగ్గించుకునే మాటలు మాట్లాడొద్దు" అంటూ హితవు పలికారు.

పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. విదేశాలలో చదువుకున్న వ్యక్తికి ఇదేం బుద్ధి...? అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ ప్రభుత్వం (బీఆర్ఎస్) వచ్చాక ఏ విగ్రహం పెట్టుకుంటారో పెట్టుకోండి... కానీ రాజీవ్ విగ్రహం తొలగిస్తామని చెప్పడం సరికాదన్నారు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును కూడా మారుస్తామని కేటీఆర్ అంటున్నారని, అలాంటి అనవసరపు మాటలు తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. దేశం కోసం త్యాగం చేసిన రాజీవ్ గాంధీ పేరును మారుస్తానని మాట్లాడటం సరికాదన్నారు. మరోసారి రాజీవ్ గాంధీ గురించి తక్కువ చేసి మాట్లాడితే కేటీఆర్‌కే అవమానమన్నారు. తాము కూడా మాట్లాడగలమని, కానీ దెబ్బకు దెబ్బ తమ విధానం కాదన్నారు.


More Telugu News