బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో రామ్ చరణ్... బాలీవుడ్ మెగాస్టార్ అని పేర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై నిర్వహించిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) చలనచిత్రోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెల్బోర్న్ నగరంలో రామ్ చరణ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో సందడి చేశారు.

క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్వహించే టెస్టు సిరీస్ విజేతలకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రదానం చేస్తారని తెలిసిందే. కాగా, నవంబరులో ఇరుజట్లు మరోసారి  టెస్టు సిరీస్ లో తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఐఎఫ్ఎఫ్ఎం కోసం మెల్బోర్న్ విచ్చేసిన రామ్ చరణ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. 

రామ్ చరణ్ ట్రోఫీతో ఉన్న ఫొటోను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా) సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా రామ్ చరణ్ ను బాలీవుడ్ మెగాస్టార్ అని పేర్కొంది. 

"మనలో ఒకరు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కంటే ముందున్నారా? ఈ వేసవిలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య తీవ్ర పోరాటానికి ముందు బాలీవుడ్ మెగాస్టార్ రామ్ చరణ్ తో కలిసి మెల్బోర్న్ లో కోలాహలం సృష్టించడం సంతోషదాయకం" అని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది.


More Telugu News