ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తాత్కాలిక ఊరట

  • ముడా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య
  • కర్ణాటక సీఎంపై విచారణకు ఉత్తర్వులు ఇచ్చిన గవర్నర్
  • గవర్నర్ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేసిన సిద్ధరామయ్య
ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు సిద్ధరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

ఏం జరిగింది?

మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రిట్ పిటిషన్‌లో ప్రాసిక్యూషన్‌ నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

నా జీవితం తెరిచి ఉంచిన పుస్తకం

తాను దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేశానని... తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని సిద్ధరామయ్య అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎక్కడా ఎలాంటి మచ్చా లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో వారి సేవలో కొనసాగుతున్నానని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలకు కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. తనపై విచారణ చేయాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. వాటిని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.


More Telugu News