చంపయి సోరెన్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలపై స్పందించిన సీఎం హేమంత్ సోరెన్

  • కుటుంబాలను, పార్టీలను చీల్చేందుకు బీజేపీ డబ్బును ఉపయోగిస్తోందని ఆరోపణ
  • ఎన్నికల సంఘం బీజేపీ సంస్థగా మారిపోయిందని విమర్శలు
  • రాష్ట్రంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన ఝార్ఖండ్ సీఎం
జేఎంఎం పార్టీ కీలక నేత చంపయి సోరెన్‌ సహా ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఝార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సంక్షోభం దిశగా కదులుతున్నట్టు అక్కడి రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంపయి సోరెన్, ఇతర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలపై ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్ తొలిసారి పెదవి విప్పారు. కుటుంబాలను, పార్టీలను చీల్చేందుకు బీజేపీ డబ్బును ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు.

బీజేపీ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని, డబ్బు ప్రభావంతో నాయకులు పెద్దగా ఆలోచించకుండా వెంటనే సులభంగా పక్క పార్టీల్లోకి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. పాకుర్ జిల్లాలో జరిగిన ‘ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి మైనీయ సమ్మాన్ యోజన (జేఎంఎంఎస్‌వై) కార్యక్రమంలో హేమంత్ సోరెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంపయి సోరెన్ పార్టీ మారే అవకాశం ఉందంటూ గట్టిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం హేమంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఏడాదే ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ఎన్నికల సంఘంపై హేమంత్ సోరెన్ విమర్శలు..
సీఎం హేమంత్ సోరెన్ ఎన్నికల సంఘంపై కూడా విమర్శలు గుప్పించారు. ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థగా కాకుండా బీజేపీ సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. ఝార్ఖండ్‌లో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు జేఎంఎం పార్టీకి అనుకూలంగా ఉంటాయని, నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికల నగారా మోగబోతోంది. అయితే ఈ ఎన్నికల సమయం బీజేపీకి మాత్రమే తెలుసు. ఎన్నికల సంఘం ఇకపై రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఈసీ బీజేపీకి చెందిన సంస్థగా మారిపోయింది. త్వరగా ఎన్నికలు పెట్టాలి. వాళ్లని (బీజేపీ నాయకులు) శుద్ధి చేసి గుజరాత్‌కు పంపాలి’’ అని హేమంత్ సోరెన్ అన్నారు.


More Telugu News