కోల్‌కతా హత్యాచారం ఘటనపై స్పందించిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ .. సమాజానికి సందేశం

  • కూతురిని రక్షించుకోవడం కాదు.. కొడుకులకు అవగాహన కల్పించాలన్న సూర్య
  • సోదరులు, తండ్రులు, భర్తలకు అవగాహన కల్పించాలని సందేశం
  • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన టీ20 జట్టు కెప్టెన్
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ -హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు సహా అన్ని రంగాల వారు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించాడు. ‘‘మీ కొడుకులకు, మీ సోదరులకు, మీ తండ్రులకు, మీ భర్తలకు, మీ స్నేహితులకు అవగాహన కల్పించండి’’ అని తన సందేశాన్ని పంచుకున్నాడు. ‘‘మీ కూతురిని రక్షించుకోవడం కాదు. మీ కొడుకుకి అవగాహన కల్పించండి’’ అంటూ ఒక టెంప్లేట్‌ను షేర్ చేశాడు.

కాగా కోల్‌కతా హత్యాచారం ఘటనపై సూర్యకుమార్ యాదవ్ కంటే ముందు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ రజమా స్పందించారు. మరికొందరు స్టార్ ప్లేయర్లు కూడా ఈ ఘటనను ఖండించారు. రెండు రోజుల క్రితం బాలీవుడ్ నటి అలియా భట్ పోస్ట్‌ను జస్పీత్ బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో  షేర్ చేశాడు. ‘‘మరో క్రూరమైన అత్యాచారం ఇది. మహిళలకు ఎక్కడా భద్రత లేదని గ్రహించిన మరో రోజు ఇది. నిర్భయ దుర్ఘటన జరిగి దశాబ్దం దాటినా ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదని గుర్తుచేసే మరో భయంకరమైన దారుణం ఇది’’ అని ఆ పోస్టులో ఉంది.  


More Telugu News