సీఎం చంద్రబాబు గారూ... గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థుల తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం: షర్మిల

  • గ్రూప్-2, డిప్యూటీ డీఈవో పోస్టులకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
  • గ్రూప్-1 అభ్యర్థులను కూడా ఇదే నిష్పత్తిలో  ఎంపిక చేయాలన్న షర్మిల 
  • అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి 
డిప్యూటీ డీఈవో, గ్రూప్-2 పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 నిష్పత్తి విధానాన్నే గ్రూప్-1 మెయిన్స్ కు సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

"సీఎం చంద్రబాబు గారూ... గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల పక్షాన మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. గ్రూప్-1 మెయిన్స్ లోనూ 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని కోరుతున్నాం. 

గ్రూప్-2, గ్రూప్-1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం, కేవలం మూడు వారాల వ్యవధిలోనే రెండు పరీక్షలు నిర్వహించడం, గ్రూప్-1 సిలబస్ ను రివిజన్ చేయలేకపోవడం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడం వంటి కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

ఇది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం... కాబట్టి దీనిపై వెంటనే సాధ్యాసాధ్యాలు పరిశీలించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం" అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు తనకు రాసిన లేఖను కూడా షర్మిల పంచుకున్నారు.


More Telugu News