ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ తో ముగిసిన చంద్రబాబు వరుస భేటీలు

  • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
  • నేటి సాయంత్రం వరుస సమావేశాలతో చంద్రబాబు బిజీ
  • ప్రధాని మోదీతో గంట పాటు సమావేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజున సాయంత్రం వరుస భేటీలతో బిజీ అయ్యారు. తొలుత ప్రధాని నరేంద్రమోదీతో  సమావేశం అయ్యారు. మోదీతో చంద్రబాబు భేటీ దాదాపు గంట సేపు సాగింది. 

రాష్ట్ర పునర్ నిర్మాణానికి తోడ్పాటు అందించాలని మోదీని చంద్రబాబు కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా నిధులు అందేలా చూడాలని చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 

ప్రధానితో సమావేశం సందర్భంగా చంద్రబాబు వెంట కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ లోక్ సభా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.

మోదీతో సమావేశం అనంతరం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై ఆమెతో చర్చించారు. సత్వరమే నిధుల విడుదల జరిగేలా చూడాలని కోరారు. 

నిర్మలాతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు... అక్కడే ఉన్న కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. 


More Telugu News