ఈ దేశానికి వెళ్లాలంటే ఇప్పుడు రెండు వారాల్లోనే వీసా

  • జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లే వారికి శుభవార్త
  • వర్క్ వీసా ప్రాసెస్ ను రెండు వారాలకు తగ్గించనున్న జర్మనీ
  • నైపుణ్యం కల్గిన కార్మికులు తక్షణం అవసరమని తెలిపిన జర్మనీ
జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి శుభవార్త. జర్మనీ వర్క్ వీసా ప్రాసెస్ చేయడానికి ఇంతకు ముందు తొమ్మిది నెలల వరకూ సమయం పట్టేది. వర్క్ వీసీ ప్రాసెసింగ్ కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నైపుణ్యం కల్గిన కార్మికుల శిక్షణపై ప్రభావం చూపుతోంది. జర్మనీలో భారీ పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలు త్వరిత వీసాలపై ఆధారపడతాయి. ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయకపోతే జర్మనీ ఆర్ధిక వ్యవస్థ 74 బిలియన్ యూరోల నష్టాన్ని చవిచూస్తుందని జర్మన్ ఎకనామిక్ ఇన్ స్టిట్యూట్ పేర్కొంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం ఫెడరల్ విదేశాంగ కార్యాలయం ఈ ఏడాది జూన్ వరకూ 80వేల వర్క్ వీసాలను జారీ చేసింది. వీరిలో 50 శాతం మంది నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు.
 
ఈ నేపథ్యంలో తమ దేశానికి నైపుణ్యం కలిగిన కార్మికులు తక్షణం అవసరమని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్ బాక్ వెల్లడించారు. ఈ డిమాండ్ ను పరిష్కరించడానికి వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. జర్మన్ ఎకనామిక్ ఇన్ స్టిట్యూట్ 2023 డేటా ప్రకారం జర్మనీలో దాదాపు 6 లక్షల ఖాళీలు ఉన్నాయి. దీంతో భారతీయుల దీర్ఘకాలిక వీసాలకు త్వరలో ఆమోదం తెలుపుతామని జర్మనీ తెలిపింది. వర్క్ వీసా ప్రాసెసింగ్ ను ఇప్పుడు కేవలం రెండు వారాలకు తగ్గించనున్నారు.
  
కాగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ రెండు రోజుల క్రితం జర్మన్ ఎంపీలు జుర్గెన్, రాల్ప్ బ్రింకాస్ లతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. డిల్లీలో జుర్గెన్ హార్డ్, రాల్ఫ్ బ్రింకాస్ లతో తాను చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.


More Telugu News