జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం ఇస్తున్నా: రిషబ్ శెట్టి

  • కాంతార చిత్రంలో నటనకు గాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు
  • హర్షం వ్యక్తం చేసిన రిషబ్ శెట్టి
  • కన్నడ చిత్ర పరిశ్రమ ఎంతో ఎదిగిందని వెల్లడి
కాంతార చిత్రంలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. తనకు జాతీయ అవార్డు రావడం పట్ల రిషబ్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, జాతీయ అవార్డును దివంగత సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు, దైవశక్తికి, దైవ నర్తకులకు, కన్నడ ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. 

కాంతార చిత్రంలో రిషబ్ శెట్టి దైవ నర్తకుడిగా నటించిన క్లైమాక్స్ ఎపిసోడ్ రోమాలు నిక్కబొడుచుకునేలా అనుభూతికి కలిగిస్తుంది. ఇవాళ కేంద్రం 70వ జాతీయ అవార్డులను ప్రకటించిన అనంతరం రిషబ్ శెట్టి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. 

తనకు జాతీయ అవార్డు వస్తే పునీత్ రాజ్ కుమార్ కు, కన్నడ ప్రజలకు, నర్తకులకు అంకితం ఇస్తానని మొదటి నుంచి చెబుతున్నానని వెల్లడించారు. ఈ సందర్భంగా హోంబలే ఫిలింస్ కాంతార టీమ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. హోంబలే ఫిలింస్ చిత్ర నిర్మాణ సంస్థకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయని తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమ ఎంతో ఎదిగిందని చెప్పడానికి ఈ జాతీయ పురస్కారమే ఒక ఉదాహరణ అని వివరించారు. 

కాంతార సినిమాకు పనిచేసిన కెమెరామన్, ఈ సినిమా కాస్ట్యూమర్ గా వ్యవహరించిన నా భార్య ప్రజ్ఞాశెట్టి ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు అని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇక, అజనీశ్ లోక్ నాథ్ అందించిన సంగీతానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు.


More Telugu News