ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • 2020 ఆగస్ట్ 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ఉత్తర్వులు
  • 2020 అక్టోబర్ 15 వరకు స్వీకరించిన దరఖాస్తులనూ పరిగణలోకి తీసుకుంటామని వెల్లడి
  • అన్ని డాక్యుమెంట్లు ఇవ్వని వారికి సమాచారం ఇచ్చామన్న ప్రధాన కార్యదర్శి
లేఔట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్‌)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 ఆగస్ట్ 26 కంటే ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని నియమనిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందించింది. 

2020 అక్టోబర్ 15వ తేదీలోగా స్వీకరించిన దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

2020లో నియమ నిబంధనలు విడుదలైనప్పటికీ... ఈ ఏడాది జనవరిలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 4.28 లక్షలకు పైగా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్‌కు 60,213 దరఖాస్తులు ఆమోదం పొందగా, రూ.96.60 కోట్లు వసూలైనట్లు చెప్పారు. 75 శాతం దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వలేదన్నారు.

అన్ని డాక్యుమెంట్లు ఇవ్వని దరఖాస్తుదారులకు ఇప్పటికే ఈ విషయం తెలియజేశామన్నారు. వాటిని అప్ లోడ్ చేయలేకపోయామని, అందుకే సకాలంలో ప్రాసెస్ కాలేదన్నారు. 

పూర్తి డాక్యుమెంట్లను సమర్పించేందుకు వారికి గడువు ఇచ్చినట్లు చెప్పారు. సేల్ డీడ్, మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్, లేఔట్ కాపీలను అప్ లోడ్ చేయవచ్చునన్నారు. మొబైల్ నెంబర్, చిరునామా, ఇతర వివరాలతో పాటు ఓటీపీని ఉపయోగించి సవరించుకోవాలని సూచించారు. హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


More Telugu News