అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించిన రోజా, కొడాలి నాని, వంశీ నేడు ఏమయ్యారు?: మంత్రి కొల్లు రవీంద్ర

  • మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజా దర్బారు
  • వినతులు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర
  • రెడ్ బుక్ అంటే చాలు వైసీపీ నేతల పంచెలు తడిసిపోతున్నాయని ఎద్దేవా
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై ప్రజా దర్బారులో భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. గత ఐదేళ్లలో ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో భారీగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.

రెడ్ బుక్ అంటే చాలు... వైసీపీ నేతల పంచెలు తడిసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల నుంచి, ప్రజల్లోంచి పుట్టుకొచ్చిందే రెడ్ బుక్ అని వివరించారు. అధికారం ఉంది కదా అని నాడు రోజా, కొడాలి నాని, వంశీ ఇష్టానుసారం వ్యవహరించారని, ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. 

నాడు చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్ దాడికి దిగి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. దేవినేని అవినాశ్ దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో ఉంటే, అతడిని విమానాశ్రయం నుంచి వెనక్కి తీసుకువచ్చారని వివరించారు. తప్పు చేసిన వాళ్లెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. 

ఇవాళ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కొల్లు రవీంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News