దశాబ్దకాలం తర్వాత జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు... షెడ్యూల్ విడుదల

  • జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు
  • నేడు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
  • కశ్మీర్ లో మూడు విడతల్లో  ఎన్నికలు
  • హర్యానాలో ఒకే విడతలో పోలింగ్
  • అక్టోబరు 4న ఎన్నికల ఫలితాల వెల్లడి
సుదీర్ఘకాలం పాటు అసెంబ్లీ ఎన్నికలకు నోచుకోని కశ్మీర్ లోయలో ప్రజాస్వామ్య వీచికలు వీయనున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

కేంద్ర ఎన్నికల సంఘం నేడు జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. జమ్మూ కశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ వెల్లడించింది. 

సెప్టెంబరు 18న తొలి విడతలో 24 స్థానాలకు, సెప్టెంబరు 25న రెండో విడతలో 26 స్థానాలకు, అక్టోబరు 1న మూడో విడతలో మిగిలిన 40 స్థానాలకు పోలింగ్ ఉంటుందని వివరించింది. అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

2019లో జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశాక తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2014 నుంచి ఇక్కడ ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి.

అటు, హర్యానాలో అక్టోబరు 1న అసెంబ్లీ ఎన్నికలు జరుపనున్నారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అక్టోబరు 4న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుపనున్నారు.


More Telugu News