లచ్చన్నను అవమానించిన వైసీపీ నేతలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు: మంత్రి అచ్చెన్నాయుడు

  • విర్రవీగిన వారికి ప్రజలు వాత పెట్టారన్న మంత్రి
  • గౌతు లచ్చన్నకు కులం, మతం లేవని వ్యాఖ్య 
  • తోటపల్లి బ్యారేజీకి గౌతు లచ్చన్న పేరు పెట్టామని వెల్లడి
సర్దార్ గౌతు లచ్చన్నను అవమానించిన వైసీపీ నేతలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గౌతు లచ్చన్న 115వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలోని లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు లచ్చన్న చేసిన సేవలను మంత్రి గుర్తుచేసుకున్నారు. రైతుల కోసం ఆయన శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేశారని, సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నేత గౌతు లచ్చన్న అని కొనియాడారు. ఐదుసార్లు ప్రజాప్రతినిధిగా గెలుపొందిన గౌతు లచ్చన్నకు కులం, మతం లేవన్నారు. ఆయన అందరి వాడని చెప్పారు.

తమలాంటి నాయకులకు గౌతు లచ్చన్న ఆదర్శమని, ఆయన ఆశయ సాధన కోసం తామంతా కలిసి పనిచేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఎన్జీ రంగాకు శిష్యుడిగా రాజకీయం చేసిన లచ్చన్న.. ఎన్జీ రంగా కోసం తన పదవినే త్యాగం చేశారని గుర్తుచేశారు. అలాంటి గొప్ప నేతను అధికార మదంతో వైసీపీ నేతలు అవమానించారని ఆరోపించారు. లచ్చన్నకు సర్దార్ బిరుదు ఇవ్వలేదంటూ కారుకూతలు కూశారని విమర్శించారు. లచ్చన్నను అవమానించిన వైసీపీ నేతలకు గత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మంత్రి పేర్కొన్నారు. తోటపల్లి బ్యారేజీకి తమ ప్రభుత్వం సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


More Telugu News