కోల్‌కతా హత్యాచార ఘటనపై పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన తృణమూల్ నేత పదవి ఊడింది!

  • శంతను సేన్‌ను పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించిన అధిష్ఠానం
  • తనకు ఈ విషయం మీడియా ద్వారానే తెలిసిందన్న నేత
  • ఆరోగ్యశాఖలో వాస్తవంగా ఏం జరుగుతోందో సీఎం దృష్టికి వెళ్లడం లేదన్న సేన్
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన విషయంలో సొంతపార్టీపైనే విమర్శలు చేసిన శంతను సేన్ పదవి ఊడింది. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆయనను అధిష్ఠానం తప్పించింది. పదవి నుంచి తనను తప్పించిన అనంతరం సేన్ మాట్లాడుతూ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపైన, అలాగే ఆసుపత్రిని ధ్వంసం చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

మాజీ మంత్రి, వృత్తిరీత్యా వైద్యుడైన శంతను సేన్ మాట్లాడుతూ మూడేళ్లుగా ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యశాఖలో వాస్తవంగా  ఏం జరుగుతున్నదనే విషయాన్ని కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం లేదన్నారు. తనను పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించినట్టు మీడియాలో చూసే తెలుసుకున్నట్టు చెప్పారు.

 ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలని, తాను ఆ స్టేట్‌మెంట్‌ను అధికార ప్రతినిధిగానే ఇచ్చానని తెలిపారు. తాను పార్టీకి కానీ, ఏ నాయకుడికీ వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖకు సంబంధించిన వార్తలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టికి వెళ్లడం లేదని పునరుద్ఘాటించారు.

ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరినప్పుడు, లేదంటే ఇతర పార్టీల్లో గెలిచి తమ పార్టీలో చేరిన నేతలకు గౌరవం ఇచ్చినప్పుడు బాధగా అనిపిస్తుందని శంతను సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం అంకితభావంతో నిజమైన సేవకుడిలా పనిచేసిన నాయకుడు దీనిని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. టీఎంసీకి సంబంధించి అన్ని యుద్ధాల్లోనూ తానో సైనికుడిలా పనిచేశానని చెప్పారు. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నట్టు వివరించారు.


More Telugu News