నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు: కేటీఆర్‌

  • మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై కేటీఆర్ వివాదా‌స్ప‌ద వ్యాఖ్య‌లు
  • తాజాగా త‌న కామెంట్స్‌ను వెన‌క్కి తీసుకున్న బీఆర్ఎస్ నేత‌
  • మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే ఉద్దేశం త‌న‌కు లేదన్న కేటీఆర్‌
స్వాతంత్ర్య దినోత్స‌వం నాడు పార్టీ నేతల సమావేశంలో చేసిన కామెంట్స్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై త‌న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం కావ‌డంపై ఆయ‌న తాజాగా స్పందించారు. యథాలాపంగా చేసిన కామెంట్స్‌కు విచారం వ్యక్తం చేస్తున్నట్టు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు చేశారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని అన్నారు. 

"నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు." అని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. 

నిన్న‌టి పార్టీ నేత‌ల మీటింగ్‌లో కేటీఆర్ ఏమ‌న్నారంటే..
ఉచితంగా బస్సుల్లో వెళ్తున్న కొందరు కూరగాయలు అమ్మడం, బ్రష్ చేయడం, వెల్లుల్లి ఒలుస్తూ, కుట్లు వేస్తూ కనిపించడంపై కేటీఆర్ స్పందించారు. కుట్లు, అల్లికలే కాదు, అవసరమైతే డ్యాన్సులు కూడా చేసుకోండని అన్నారు. తాము తప్పు అని అనడం లేదని.. బస్సులు పెంచండని, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు కేటాయించండంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదం అయ్యాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు మండిపడ్డారు.


More Telugu News