కనీసం జాతీయ గీతం వినే ఓపిక కూడా లేకపోతే ఎలా?: బ్రహ్మానందం

  • స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదన్న బ్రహ్మానందం
  • సినిమా థియేటర్ లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక నేటి యువతకు లేకపోవడం బాధాకరమని వ్యాఖ్య
  • విద్యార్ధులకు బ్యాగ్ లు, వికలాంగులకు వీల్ చైర్ లు అందజేత
జాతీయ గీతం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారికి ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం చురకలు అంటించారు. హైదరాబాద్ బేగంబజారులో భగత్ సింగ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డూ యాదవ్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బ్రహ్మానందం పాల్గొని ప్రసంగించారు. నాడు స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో నేడు దేశ వ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదని అన్నారు.
 
సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఎలాగో స్వాతంత్ర్య దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగ లాంటిదని పేర్కొన్నారు. సినిమా థియేటర్ లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతకు లేకపోవడం బాధాకరమని బ్రహ్మానందం ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను, త్యాగాలను నేటి యువత తెలుసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్దులకు బ్యాగ్ లు, వికలాంగులకు వీల్ చైర్ లను బ్రహ్మానందం చేతుల మీదుగా పంపిణీ చేశారు.


More Telugu News