అగ్ని క్షిపణి పితామహుడు అగర్వాల్ కన్నుమూత

  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్ఎన్ అగర్వాల్
  • ఈరోజు హైదరాబాద్ లో కన్నుమూసిన మిస్సైల్ లెజెండ్
  • లాంగ్ రేంజ్ క్షిపణుల అభివృద్ధిలో పేరుగాంచిన అగర్వాల్
చైనాకు ముచ్చెమటలు పట్టిస్తున్న 'అగ్ని' క్షిపణి పితామహుడు ఆర్ఎన్ అగర్వాల్ (రామ్ నారాయణ్ అగర్వాల్) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆయన ఈరోజు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అగ్ని క్షిపణి ప్రాజెక్టుకు తొలి డైరెక్టర్ గా ఆయన వ్యవహరించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది. 2004లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును అగర్వాల్ అందుకున్నారు. 

లాంగ్ రేంజ్ క్షిపణుల అభివృద్ధిలో అగర్వాల్ పేరుగాంచారు. ప్రఖ్యాత ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. డీఆర్డీవోతో అగర్వాల్ కు దశాబ్దాల అనుబంధం ఉంది. 1983లో ప్రారంభమైన అగ్ని క్షిపణి కార్యక్రమానికి అగర్వాల్ నాయకత్వం వహించారు. అగర్వాల్ మృతి పట్ల డీఆర్డీవో శాస్త్రవేత్తలు సంతాపం ప్రకటించారు. ఒక మేధావిని కోల్పోయామని వారు పేర్కొన్నారు. అగర్వాల్ ఐఐటీ మద్రాస్, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చదువుకున్నారు.


More Telugu News