ఉక్రెయిన్ కు విరాళం ఇచ్చినందుకు మహిళా డ్యాన్సర్ కు 12 ఏళ్ల జైలు శిక్ష విధించిన రష్యా

  • స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చిన డ్యాన్సర్ కరేలీనా
  • ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా
  • 12 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించిన కోర్టు
శత్రుదేశం ఉక్రెయిన్ కు విరాళం ఇవ్వడంతో క్సేనియా కరేలీనా (32) అనే బ్యాలే డ్యాన్సర్ కు రష్యా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికా - రష్యన్ పౌరురాలు అయిన కరేలీనా అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఉంటోంది. ఉక్రెయిన్ కు అనుకూలంగా వ్యవహరించే ఓ స్వచ్ఛంద సంస్థకు ఆమె 50 డాలర్లకు పైగా విరాళం ఇచ్చింది. ఈ విషయాన్ని రష్యా చాలా తీవ్రంగా పరిగణించింది. 

గత జనవరిలో రష్యాలోని యెకాటెరిన్ బర్గ్ లో ఉన్న తన కుటుంబాన్ని సందర్శించేందుకు కరేలీనా రష్యాకు వచ్చింది. ఆ వెంటనే రష్యన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహానికి పాల్పడిందంటూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేయడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పౌరులను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేస్తున్నారని విమర్శించింది. ఆమెను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ... అమెరికా సఫలీకృతం కాలేదు. 

కోర్టులో కేసు విచారణ సందర్భంగా కరేలీనా నేరాన్ని అంగీకరించిందని రష్యన్ మీడియా తెలిపింది. కరేలీనా దేశద్రోహానికి పాల్పడిందని ఈరోజు కోర్టు నిర్ధారించింది. ఆమెకు కోర్టు 12 ఏళ్ల జైలు శిక్షను విధించింది. కోర్టు తీర్పును చదివే సమయంలో కరేలీనా కోర్టులోనే ఉంది. తెల్లటి టాప్, జీన్స్ ధరించి ఆమె కనిపించింది.


More Telugu News