వినేశ్ ఫొగాట్ అప్పీల్‌ను సీఏఎస్ తిరస్కరించడంపై స్పందించిన న్యాయవాది

  • ఫొగాట్ అనర్హతపై సింగిల్ లైన్ ఆర్డర్ మాత్రమే వచ్చింది... వివరణ రావాల్సి ఉందన్న లాయర్
  • మరో 15 రోజుల్లో వివరణాత్మక ఆదేశాలు రావొచ్చునని వ్యాఖ్య
  • ఆ తర్వాత అప్పీల్‌కు 30 రోజుల సమయం ఉంటుందని వెల్లడి
వినేశ్ ఫొగాట్ అనర్హతపై సీఏఎస్ సింగిల్ లైన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చిందని, ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు 10 లేదా 15 రోజుల్లో రావొచ్చునని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ న్యాయవాది విదుష్పత్ సింఘానియా అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో ఫైనల్లో తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో రజతం ఇవ్వాలంటూ వినేశ్ ఫొగాట్ చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తోసిపుచ్చింది.

ఈ తీర్పుపై సింఘానియా ఏఎన్ఐ మీడియా సంస్థతో మాట్లాడుతూ... సీఏఎస్ సింగిల్ లైన్ ఆర్డర్‌ను మాత్రమే జారీ చేసిందన్నారు. వివరణతో కూడిన ఆదేశాలు రావాల్సి ఉన్నాయన్నారు. ఫొగాట్ అప్పీల్‌ను కొట్టివేయడంపై సీఏఎస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. ఈ నిర్ణయంపై 30 రోజుల్లో స్విస్ ఫెడరల్ ట్రైబ్యునల్‌లో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. 

"అప్పీల్‌ను ఎందుకు డిస్మిస్ చేశారన్నది చెప్పలేదు. అలాగే ఇంత సమయం ఎందుకు తీసుకున్నారో వెల్లడించలేదు. నిన్న సాయంత్రం వచ్చిన నిర్ణయంతో మేం ఆశ్చర్యపోయాం. నిరాశ చెందాం కూడా. సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే మాతోనే ఉన్నారు. ఆయన సూచనలతో ముందుకు సాగుతాం. ఆయనతో కూర్చొని అప్పీల్ డ్రాఫ్ట్‌ను ఫైనల్ చేస్తాం' అని విదుష్పత్ పేర్కొన్నారు.


More Telugu News