సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం.. మ‌డ‌మ‌తిప్పేది లేదు: మంత్రి నారా లోకేశ్‌

  • గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య వేడుక‌ల్లో పాల్గొన్న‌ మంత్రి లోకేశ్‌
  • తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలుచేస్తామ‌ని హామీ
  • అనవసరమైన నిబంధనలతో పథకాలు కట్ చేయబోమ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామ‌న్న మంత్రి
  • గుంటూరులో భూగర్భడ్రైనేజి త్వరలో పూర్తి చేస్తామంటూ వ్యాఖ్య‌
  • మంగళగిరి-తాడేపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేస్తామని వెల్ల‌డి
  • మంగళగిరిలో జ్యుయలరీ పార్కు, వీవర్స్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామ‌న్న లోకేశ్‌
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న ఈ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజలందరి కళ్లల్లో ఆనందం కనబడుతోందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్-6 హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి లోకేశ్‌ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ప్రజల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

జిల్లా యంత్రాంగం తయారు చేసిన అభివృద్ధి శకటాలను వీక్షించి, ఉత్తమ శకటాలకు అవార్డులు అందజేశారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించి, ఉత్తమ స్టాళ్లకు మంత్రి అవార్డులు అందించారు. అలాగే జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు అవార్డులను అందజేశారు. 

ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. "ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు, ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. చంద్రబాబు హామీలకు కండిషన్స్ ఉండవు. అనవసరమైన నిబంధ‌న‌ల‌తో సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసేదిలేదు

ఏడాదికి రూ. 250 పెంచడం కాదు.. ఒకేసారి వెయ్యి రూపాయిలు పెంచి రూ. 4వేల పెన్షన్ అమలు చేస్తున్నాం. మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. తల్లికి వందనం పథకాన్ని అమలుచేస్తాం. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం.  

అలాగే మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుంది. పేద వాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఆర్థిక సాయం, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తాం. చేనేత వస్త్రాలకు జీఎస్టీ రద్దుపై కేంద్రంతో చర్చిస్తున్నాం. 

త్యాగధనుల పుట్టినిల్లు గుంటూరు జిల్లా!

గుంటూరు జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. `మాకొద్దీ తెల్లదొరతనం` పాటతో స్వాతంత్య్ర పోరాటంలో కదం తొక్కిన ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ ఈ నేలపైనే జన్మించారు. పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో ఆందోళనలు చేపట్టారు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది. 

స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు, అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశం అంటే భక్తి ఉండాలి... తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండాలి... ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి. 

ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చూశాను. కానీ, ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. శాంతి, అహింసే ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారి మార్గంలో మనం స్వాతంత్య్రం సాధించుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింసే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు. 

రైతులకు అండగా ప్రజాప్రభుత్వం

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలుస్తోంది. జిల్లాలో 92,000 హెక్టార్లలో సాగవుతున్న వివిధ పంటలను ఈ-పంట యాప్ ద్వారా నమోదు చేశాం. ఇప్పటివరకు 4,488 క్వింటాళ్ళ నాణ్యమైన విత్తనాలు అందించాం. 22,754 టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేస్తున్నాం. భూసార పరీక్షలు జరుగుతున్నాయి. 

పీఎం కిసాన్ పథకం క్రింద 85,400 మంది రైతు కుటుంబాలకు 17వ విడత ఆర్ధిక సహాయం రూ.17 కోట్లు అందించాం. ఈ సీజన్ లో జిల్లాలో 29వేల మంది కౌలు రైతులకు సీసీఆర్ సీ కార్డుల ద్వారా 30 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాం. 

జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి నిధులిచ్చాం. జిల్లాలోని 10 రైతుబజార్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందిస్తున్నాం. గుంటూరు, తెనాలి, దుగ్గిరాల మార్కెట్ యార్డుల్లో జులై 2024 నాటికి 35,186 మంది రైతులకు చెందిన 3,46,017 క్వింటాళ్ళ పంటలను ఈ-నామ్ ద్వారా విక్రయించారు. 

పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా జిల్లాలోని 6,689 మంది రైతులకు 20 కోట్లు రుణాలు మంజూరు చేశాం. 7 నియోజకవర్గాల్లో యానిమల్ డిసీజ్ డయాగ్నస్టిక్ లేబరేటరీల ద్వారా 12,400 పశువులకు పరీక్షలు చేసి తగిన చికిత్స అందించాం. 

ఖరీఫ్ సీజన్లో జిల్లాలో గల 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు 24 టీఎంసీల సాగునీరు అందించేలా ప్రణాళికను తయారు చేశాం. గుంటూరు ఛానల్ ఆధునికీకరణ పనులకు రూ. 652 కోట్లు మంజూరు చేశాం. జిల్లాలో పెండింగ్ లో ఉన్న 9 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నాం. 

అలాగే జిల్లాలో పీఎం మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) క్రింద సబ్సిడీపై మోపెడ్స్, ఐస్ బాక్సులు, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్ వాహనాలను అందజేశాం. పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించి... బియ్యం, కందిపప్పు తక్కువ ధరకే అందిస్తున్నాం.

తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం

తల్లికి వందనం పథకాన్ని త‌ప్ప‌కుండా అమలు చేస్తాం. జిల్లాలో 1 నుంచి 10వతరగతి వరకు చదువుతున్న 2,95,542 విద్యార్థులలో అర్హులైన విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి రూ. 15వేలు ఇస్తాం. 'ఏపీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర' స్కీమ్ లో భాగంగా 99,150 మంది విద్యార్ధులకు స్టూడెంట్ కిట్స్ అందించాం. 

'మన బడి-భవిష్యత్తు'లో భాగంగా 562 పాఠశాలల్లో 204 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. 1071 పాఠశాలలలో రోజుకి సుమారు 73,000 మంది విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అందజేస్తున్నాం. జిల్లాలో పీఎం మాతృ వందన యోజన పథకం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అప్ గ్రేడేషన్ చేపట్టాం. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. 

నాబార్డ్ నిధులతో ఆసుపత్రి భవనాల నిర్మాణం సాగుతోంది. గుంటూరు మెడికల్ కాలేజిలో రూ. 40 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి చేతులు మీదుగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 

1,480 అంగన్ వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులకు, గర్భిణీ, పాలిచ్చే మహిళలకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను రూ. 4వేలకు పెంచాం. దివ్యాంగుల పెన్షన్ రూ. 6,000లకు పెంచాం. 

శాశ్వత వైకల్యంతో బాధపడేవారికి రూ. 15వేల ఇస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్ రూ.10వేలకి పెంచి ఇంటి వద్దే అందిస్తున్నాం. జిల్లాలో ఆగష్టు 1వ తేదిన 2,60,192 మంది పింఛనుదారులకు గానూ రూ. 110 కోట్ల 69 లక్షల‌ను 4,840 మంది సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పంపిణీ చేశామ‌న్నారు.

ఉపాధి హామీ పథకంలో 29 లక్షల పనిదినాలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ఈ సంవత్సరం 29 లక్షల పనిదినాలు కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇప్పటికే 20.85 లక్షల పనిదినాలు కల్పించాం. వేతనదారులు రూ. 52 కోట్ల మేర‌ లబ్ధి పొందారు. జిల్లాలో ఆసియన్ బ్యాంకు నిధులు, పీఎంజీఎస్ వై-3, ఎస్ డీఆర్ఎఫ్, నాబార్డ్ గ్రాంటు క్రింద 115 కోట్ల రూపాయల అంచనా విలువతో 378  కి.మీ.ల రహదారుల నిర్మాణ పనులు చేపట్టాం. 

జల్ జీవన్ మిషన్ ద్వారా 2025 నాటికి జిల్లాలో 454 గ్రామాలకు ఇంటింటి కుళాయి కనెక్షన్లు అందించ‌డానికి గాను 194.28 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. జిల్లాలో అదనంగా 94 చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను నిర్వహణలోనికి తీసుకు వస్తాం. 

జిల్లాలో రూ. 248 కోట్ల అంచనాతో 232  కి.మీ.ల రహదారులు అభివృద్ధి చేస్తున్నాం. జిల్లాలోని 14 ప్రదేశాలలో ఈ రోజు నుండి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో నీటికొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రూ. 903 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజి స్కీమ్ పనులు త్వరలో పూర్తి చేస్తాం. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్స్ డ్రైనేజి స్కీమ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. 

గుంటూరు నగరంలో ట్రాఫిక్ నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని సుమారు 20వేల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా, ఒకే విడతలో 9 గంటల పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 75,228 మంది ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూ. 40 కోట్లతో జగజ్జీవన్ జ్యోతి పథ‌కం ద్వారా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామ‌ని మంత్రి లోకేశ్ తెలిపారు.

మంగళగిరిలో జ్యుయలరీ పార్కు ఏర్పాటు

మంగళగిరిలో జెమ్స్, జ్యుయలరీ పార్కు, వీవర్స్ ఫౌండేషన్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు 320 ఎంఎస్ఎంఈల ద్వారా రూ. 34 కోట్ల పెట్టుబడితో 725 మందికి ఉపాధి కల్పించాం. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ కింద ఇప్పటివరకు 263 యూనిట్లకు 197 లక్షల రూపాయలు వివిధ రాయితీలు ఇచ్చాం. పీఎంఈజీపీ కింద 41 యూనిట్లకు 318 లక్షల మార్జిన్ మనీ సబ్సిడీ ఇచ్చాం. తెనాలిలో దాల్ మిల్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 

ప్రధానమంత్రి చేనేత ముద్రా యోజన క్రింద ఈ ఆర్ధిక సంవత్సరంలో 110 మంది లబ్ధిదారులకు రూ. 1.07 కోట్ల రుణం మంజూరైంది. చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా నైపుణ్య గణన చేపడుతున్నాం. జిల్లాలోని ఏంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజిలో స్కిల్ డెవలప్ మెంట్ ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటుకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఉచిత ఇసుక విధానం అమలులోకి తీసుకొచ్చాం. ఉచిత ఇసుక విధానాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం. బలహీన వర్గాల వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి అనేక ప్రణాళికలు అమలు చేస్తున్నాం. 

2024 కేంద్ర వార్షిక బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు కేటాయించింది. సీఆర్డీఏ పర్యవేక్షణలో రాజధాని నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నాం. నల్లపాడు-బీబీనగర్ స్టేషన్ల మధ్య గల ట్రాక్ డబ్లింగ్ ను, అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు స్టేషన్ ల మధ్య కొత్తగా నిర్మించే రైల్వే బ్రాడ్ గేజ్ లైనుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ పూర్తి చేసి, పనులు ప్రారంభించానికి చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి పేర్కొన్నారు.

'వికసిత్ ఆంధ్ర' కోసం ప్రణాళికాబద్ధంగా కృషి

ప్రధాని నరేంద్ర మోదీ 'వికసిత్ భారత్ 2047' స్పూర్తితో 'వికసిత్ ఆంధ్ర 2047' లక్ష్య సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్  తయారు చేసి అక్టోబర్ 2వ తేదీన ఆవిష్కరిస్తాం. చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ను గంజాయి,  డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ప్రణాళికతో కఠినమైన చర్యలు తీసుకున్నాం. 

జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సహకారం అందిస్తున్న ప్రజా ప్రతినిధులకు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అమరులైన స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు, జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్న జిల్లా కలెక్టరు, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న ఎస్పీ, సత్వర న్యాయ సేవలందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయాధిపతులు, వారి యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు. 

జిల్లా అభివృద్దికి సహకరిస్తున్న అధికారులు, అనధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకర్లకు కృతజ్ఞతలు. జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు" అంటూ మంత్రి నారా లోకేశ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


More Telugu News