మహిళా వైద్యులు రాత్రుళ్లు బయటకు వెళ్లకూడదన్న ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న సిల్చార్ మెడికల్ కాలేజ్

  • కోల్‌కతా ఘటన నేపథ్యంలో మహిళా వైద్యులు, ట్రైనీలు బయటకు వెళ్లొద్దని అస్సాం ప్రభుత్వం ఆదేశాలు
  • మహిళలకు భద్రత కల్పించడం మాని ఇవేం ఆదేశాలంటూ సర్వత్ర విమర్శలు
  • ఆదేశాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రకటన
మహిళా వైద్యులు, విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని సూచిస్తూ జారీచేసిన ఆదేశాలను అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వెనక్కి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య నేపథ్యంలో సిల్చార్ కాలేజ్ ఇటీవల ఈ ఆదేశాలు జారీచేసింది. 

ఈ ఆదేశాలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలకు భద్రత కల్పించడం మానేసి ఇలా ‘స్త్రీ ద్వేషం’ నింపుకోవడం తగదంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎవరూ బయటకు వెళ్లకుండా రూముల్లోనే ఉండాలని చెప్పడం మాని క్యాంపస్‌లో భద్రత పెంపుపై దృష్టిసారించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 12న జారీచేసిన ఈ ఆదేశాలను రద్దు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. జాతీయ వైద్య కమిషన్, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా  త్వరలోనే నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొంది.


More Telugu News