మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

  • ఉచితాలు పంచేందుకు డబ్బు ఉంటుంది కానీ పరిహారం చెల్లించేందుకు లేదా? అంటూ ప్రశ్న
  • ప్రైవేట్ ల్యాండ్ ను నిబంధనల ప్రకారం సేకరించలేదని వ్యాఖ్య
  • 60 ఏళ్లుగా బాధితుడికి పరిహారం ఇవ్వకపోవడంపై సుప్రీం బెంచ్ ఫైర్
  • ఉచిత పథకాలను సస్పెండ్ చేస్తామని హెచ్చరిక
‘ఉచిత పథకాలకు ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటుంది కానీ భూసేకరణలో బాధితులకు చెల్లించేందుకు మాత్రం డబ్బు లేదా?’ అంటూ మహారాష్ట్ర సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవై ఏళ్లుగా బాధితుడికి డబ్బు చెల్లించకపోవడంపై సీరియస్ అయింది. మూడు వారాల్లోగా పరిహారం చెల్లించకపోతే మహారాష్ట్రలో ఉచిత పథకాలను నిలిపి వేయాలంటూ ఆదేశాలిస్తామని హెచ్చరించింది. ఈమేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలోని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

అసలు ఏం జరిగిందంటే..
పూణేకు చెందిన ఓ వ్యక్తి భూమిని రక్షణ శాఖ అవసరాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఆ భూమిలో డీఆర్డీవోకు అనుబంధంగా ఉన్న ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ ఇనిస్టిట్యూట్ కు కేటాయించింది. ఇదంతా జరిగి అరవై ఏళ్లు కావొస్తోంది. అయితే, భూసేకరణ నిబంధనల మేరకు జరగలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం మాత్రం ఇవ్వలేదని చెప్పాడు. దీనిపై కోర్టును ఆశ్రయించగా వడ్డీతో కలిపి బాధితుడికి చెల్లించాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం స్పందించి బాధితుడికి రూ.37.42 కోట్ల పరిహారం ఆఫర్ చేసింది. అయితే, పరిహారం ఇవ్వడంలో జరిగిన జాప్యాన్ని ప్రస్తావిస్తూ.. తమకు రూ.317 కోట్లు ఇవ్వాలంటూ బాధితుడు డిమాండ్ చేశాడు. దీనిపై ప్రతిష్టంభన నెలకొంది. 

ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడంతో బాధితుడు మరోమారు సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. తాజాగా ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. బాధితుడికి వెంటనే పరిహారం చెల్లించకపోతే మహారాష్ట్రలో ఉచిత పథకాలు నిలిపేయాలంటూ ఆదేశాలిస్తామని హెచ్చరించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన లాయర్ మూడు వారాల గడువు కోరారు. ఈ గడువు మంజూరు చేస్తూ.. ఆ తర్వాత కూడా పరిహారం చెల్లించకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని సుప్రీం బెంచ్ హెచ్చరించింది.


More Telugu News