ఒలింపిక్స్‌ నిర్వహణపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • ఎర్రకోటపై జాతీయ‌జెండాను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ 
  • ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వడం భారత్ కల అన్న ప్ర‌ధాని
  • 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్ల‌డి
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ‌జెండాను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌ నిర్వహణపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌ కల అని మోదీ అన్నారు. 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని మోదీ వెల్ల‌డించారు. అలాగే పారాలింపిక్స్ 2024కి వెళ్తున్న‌ భారత అథ్లెట్లకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

"ఒలింపిక్స్ లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన యంగ్ అథ్లెట్లు మనతోనే ఉన్నారు. 140 కోట్ల మంది తరఫున వారందరికీ నేను కంగ్రాట్స్‌ చెబుతున్నా. మరికొన్ని రోజుల్లో పారా ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు అథ్లెట్లు వెళ్లనున్నారు. వారికి ఆల్‌ ది బెస్ట్. మనం జీ20 సమ్మిట్ ను దిగ్విజయంగా నిర్వహించాం. ఈ సమ్మిట్ తో భారీ ఈవెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించగలమని నిరూపించాం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌ కల. 2036లో నిర్వహించేందుకు మేమంతా సిద్ధమవుతున్నాం" అని మోదీ అన్నారు.

పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త్‌ ప్ర‌ద‌ర్శ‌న ఇలా..
విశ్వ‌వేదిక‌ల‌పై సత్తా చాటేందుకు భారత అథ్లెట్లు సుదీర్ఘంగా విశ్వ‌క్రీడ‌ల్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా టోక్యో ఒలింపిక్స్ 2020 లో ఇండియా ఏడు పతకాలను కైవ‌సం చేసుకుంది. త‌ద్వారా ఒలింపిక్స్ ఒకే ఎడిషన్‌లో అత్య‌ధిక ప‌త‌కాలు సాధించి రికార్డు సృష్టించింది. ఆ త‌ర్వాత‌ పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్‌లో భారత్ మూడు కాంస్య పతకాలు స‌హా ఆరు మెడ‌ల్స్ గెలుచుకుంది. ఇందులో హాకీ జట్టు మరో కాంస్యం గెల‌వ‌గా, రెజ్లింగ్‌ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అమన్ సెహ్రావత్ కూడా ఇంకో కాంస్యం సాధించాడు. అలాగే పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌లో గోల్డెన్ బాయ్‌ నీరజ్‌ చోప్రా రజత పతకం గెలిచి మరోసారి మెరిశాడు.

ఇక యువ‌ షూట‌ర్‌ మను భాకర్ పారిస్ గేమ్స్‌లో భార‌త్ త‌ర‌ఫున ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆమె ఒలింపిక్ క్రీడల ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా రికార్డుకెక్కారు. అయితే, మొత్తంగా చూసుకుంటే మాత్రం భార‌త్ ఈ విశ్వ‌క్రీడ‌ల్లో త‌న స్థాయికి త‌గ్గ‌ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం లేద‌నేది క్రీడా విశ్లేష‌కుల అభిప్రాయం. మ‌న కంటే ఎన్నో చిన్న దేశాలు ప‌త‌కాల పంట పండిస్తుంటే.. మ‌నం మాత్రం ఐదారు ప‌త‌కాల‌తోనే స‌రిపెట్టుకుంటున్నామ‌నేది కాద‌న‌లేని వాస్త‌వం.



More Telugu News