శ్రీకాకుళం జ‌వాన్‌కు కీర్తిచ‌క్ర పుర‌స్కారం

  • మేజ‌ర్ మ‌ళ్ల రామ్‌గోపాల్ నాయుడికి ప్ర‌తిష్ఠాత్మ‌క కీర్తిచ‌క్ర పుర‌స్కారం
  • నేడు రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న రామ్‌గోపాల్‌
  • ఈ ఏడాది ఈ పురస్కారానికి న‌లుగురిని ఎంపిక చేసిన కేంద్రం 
  • పుర‌స్కారానికి ఎంపికైన న‌లుగురిలో స‌జీవంగా వున్నది రామ్‌గోపాల్ ఒక్క‌రే  
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజ‌ర్ మ‌ళ్ల రామ్‌గోపాల్ నాయుడిని కీర్తిచ‌క్ర పుర‌స్కారం వ‌రించింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న‌ను ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన పుర‌స్కారానికి ఎంపిక చేసింది. ఇవాళ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ఆయ‌న ఈ అవార్డు అందుకోనున్నారు. 

కాగా, ఈ ఏడాది ఈ పురస్కారానికి న‌లుగురిని కేంద్రం ఎంపిక చేసింది. అయితే, ఈ న‌లుగురిలో స‌జీవంగా వున్నది రామ్‌గోపాల్ నాయుడు మాత్ర‌మే. 2012లో ఇండియ‌న్ ఆర్మీలో చేరిన ఆయ‌న‌.. 2023 అక్టోబ‌ర్ 26న జ‌రిగిన ఓ ఆప‌రేష‌న్‌లో కీల‌కంగా వ్య‌వ‌హరించారు. 

కుప్వారా జిల్లాలో నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి మోహ‌రించిన ఆక‌స్మిక సైన్య బృందానికి రామ్‌గోపాల్ నాయ‌కుడిగా ఉన్నారు. దీనిలో భాగంగా ఉదయం 10 గంట‌ల ప్రాంతంలో ఓ జవాను ఐదుగురు ఉగ్ర‌వాదుల‌ను గుర్తించి రామ‌గోపాల్‌కి తెలియ‌జేయ‌డంతో వారిపై సైన్యం దాడి చేసింది. 

ఈ దాడిలో మిగ‌తా జ‌వాన్ల‌ను ముందుండి న‌డిపించారాయ‌న. జ‌వాన్ల‌తో క‌లిసి న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను తుద‌ముట్టించారు. ఈ క్ర‌మంలో ఓ ఉగ్ర‌వాది రామ్‌గోపాల్ నేతృత్వంలోని ఆర్మీ బృందంపై గ్రెనేడ్ విసిరాడు. దాని నుంచి త‌ప్పించుకుని మ‌రీ స‌ద‌రు ఉగ్ర‌వాదిని హ‌త‌మార్చి ఆప‌రేష‌న్‌ను ముగించారు. 

ఇలా ఈ పోరాటంలో వెంట ఉన్న జవాన్ల‌ను కాపాడుకోవ‌డంవల్ల త‌నకు ఈ పుర‌స్కారం ల‌భిస్తోంద‌ని రామ్‌గోపాల్ పేర్కొన్నారు. ఇది త‌న‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణం అన్నారు.


More Telugu News