కిమ్ కీలక నిర్ణయం... పర్యాటకులకు ఆహ్వానం

  • విదేశీ పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఉత్తర కొరియా
  • డిసెంబర్ నుండి టూరిస్ట్ లకు అనుమతి
  • పర్యాటక అనుమతిపై కొరియో టూర్స్ వెబ్ సైట్ లో వెల్లడి
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశాన్ని సందర్శించాలనుకునే విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పారు. ఈశాన్య నగరమైన సంజియోన్ కి డిసెంబర్ నెల నుండి అంతర్జాతీయ పర్యాటకాన్ని పునః ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాలకూ పర్యాటకాన్ని అనుమతించవచ్చని ఆ దేశ టూరిస్ట్ కంపెనీలు బుధవారం వెల్లడించాయి. కఠినమైన కొవిడ్ నిబంధనల కారణంగా ఆ దేశం తన సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. 2020 నుండి అంతర్జాతీయ పర్యాటకులను ఉత్తర కొరియా నిషేధించింది. తాజాగా కొవిడ్ తగ్గడంతో తమ దేశానికి అంతర్జాతీయ పర్యాటకులను ఆహ్వానిస్తొంది. ఈ ప్రకటన కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న కొరియా టూర్స్ హర్షం వ్యక్తం చేసింది.
 
ఉత్తర కొరియాలోని సంజియోన్ నగరం చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో పర్యాటకుల కోసం అపార్ట్ మెంట్లు, స్కీ రిసార్ట్స్, హోటళ్లు ఏర్పాటు అయ్యాయి. మరో ట్రావెల్ ఏజన్సీ కేటీజీ టూర్స్ సైతం ఈ శీతాకాలం నుండి పర్యాటకులు సంజియోన్ కు వెళ్లవచ్చని ప్రకటించింది. సంజియోన్ కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు అధికారికంగా పర్యాటక కార్యకలాపాలు 2024 డిసెంబర్ లో తిరిగి ప్రారంభమవుతాయని తమ స్థానిక భాగస్వామి నుండి ధ్రువీకరణ పొందామని బీజింగ్ కు చెందిన కొరియో టూర్స్ తన వెబ్ సైట్ లో తెలిపింది.

కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఉత్తర కొరియా గత ఏడాది అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించింది. ఆ క్రమంలో రష్యన్ పర్యాటకులు ఫిబ్రవరిలో ప్రైవేట్ పర్యటన కోసం ఉత్తర కొరియాను సందర్శించారు. జూన్ నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా విదేశీ ఉన్నతాధికారులు ఆ దేశాన్ని సందర్శించారు.


More Telugu News